ఒమిక్రాన్ కేసులతో ఆర్టీసీలో ఆందోళన.. గతంలో కరోనాతో 300 మంది ఆర్టీసీ సిబ్బంది మృతి
TSRTC - Omicron Cases: ప్రయాణికులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటున్న ఆర్టీసీ సిబ్బంది
TSRTC - Omicron Cases: కరోనా తగ్గిందనుకుంటున్న సమయంలో దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. హైదరాబాద్‌లో దాని లక్షణాలు బయటపడటంతో.., వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టడి చర్యలు ప్రారంభించింది. ఆర్టీసీ సిబ్బంది కూడా కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.
ఆర్టీసీలో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని డ్రైవర్లు, కండక్టర్లు సూచిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం శానిటైజర్ బస్సులో అందుబాటులో లేదంటున్నారు కండక్టర్లు. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అదనపు బస్సులు నడిపించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
గత కోవిడ్ సమయంలో ఆర్టీసీ 3వేల 700కోట్ల రూపాయల మేర నష్టపోయింది. అంతేకాదు.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్, ఛైర్మన్ బాజిరెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
గతంలో కోవిడ్ బారినపడి దాదాపు 300 మంది ఆర్టీసీ సిబ్బంది మరణించినట్లు చెప్పారు ఆర్టీసీ జేఏసీ నేత హనుమంత్. అయితే ఇప్పుడైన అధికారులు ఆర్టీసీకి సిబ్బంది వైరస్ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మొత్తానికి అయిపోయిందనుకున్న కరోనా.., కొత్త వేరియంట్ రూపంలో దేశంలోకి ప్రవేశించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఇక వైరస్ వ్యాప్తి చెందకుండ ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించాలి.