సోమశిల ప్రకృతి అందాలు.. అధికారులకు కనిపించడంలేదు !

Update: 2020-09-01 12:20 GMT

Somasila: సప్తపదుల సంగమం.. కనువిందు చేసే సుందరదృశ్యాలు, గలగల పారే నదీ తీరం చుట్టూ పచ్చని ప్రకృతి రమణీయతను పంచే కొండలు ఇదీ నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల ప్రాంత ప్రత్యేకత. పర్యాటకుల కళ్లను కట్టిపడేసేలా ఉన్న ప్రకృతి అందాలెన్నో ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. కోట్లు కేటాయించినా పనులు అంగుళం కూడా కదలలేదు. సప్తనదుల సంగమంగా పేరు పొందిన నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల పాలకుల అలసత్వంతో అభివృద్ధికి దూరమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలు కేటాయించాయి. అయినా ఇక్కడ ఎలాంటి మార్పు రాలేదు.

జిల్లాలోని కృష్ణా తీర ప్రాంతాల అభివృద్ధికి 2015లో 91 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. వీటితో సోమశిల ప్రాంతంలో కాటేజీలు,పార్కు, స్విమ్మింగ్‌పూల్, నిర్మాణాలు చేశారు. సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లేందుకు లాంచీ ఏర్పాటు చేశారు. కానీ లాంచీ ఎక్కి, దిగడానికి సరైనా ఏర్పాట్లు చేయలేదు. సింగోటంలో కాటేజీలు పూర్తైనా ఓపెన్ థియేటర్‌, పార్కు పనులు పూర్తి కాలేదు. పెంట్లవెల్లి మండలం జెట్‌ప్రోల్‌లో హోటల్‌ ఉన్నా ఇప్పటివరకు పర్యాటకులకు వసతి కల్పించలేదు.

ఇక్కడి ప్రజాప్రతినిధులు కూడా అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఇక్కడికి వచ్చే సందర్శకులకు నిరాశే మిగులుతోంది. ఒక్క సోమశిల మాత్రమే కాదు ఇలా నల్లమలలో ఎన్నో ప్రకృతి అందాలున్నాయి. అచ్చంపేట ప్రాంతంలోని మల్లెల తీర్థంలో మెట్ల నిర్మాణం, ఉమామహేశ్వరం, మన్ననూరు, ఫరాహాబాద్‌లో పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. సోమశిల-శ్రీశైలం లాంచి ప్రయాణంలో అక్క మహాదేవి గుహలు అద్బుతంగా దర్శనమిస్తాయి. అక్కడ కూడా కాటేజీల నిర్మాణం జరగలేదు. సోమశిలలో ఏటా వరద పెరిగిన సమయంలో పర్యాటకుల సందడి కనిపిస్తుంది. ప్రతీ ఏటా వీరి సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ వారికి ఉండేందుకు వసతి సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న పర్యాటకులు ఇకనైనా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులు దృష్టిసారించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News