Jagityala: ఫారెస్ట్ ఆఫీసులో.. ఉద్యోగుల దావత్..!

ఏ ఫంక్షన్ అయినా విందు చేసుకోవడం ఆనవాయితీ.. విందులో మద్యం, మాంసం ఉండడం మామూలే.. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో దావత్ చేసుకోవడం క్షమించరాని నేరం.

Update: 2024-10-12 07:34 GMT

Jagityala: ఫారెస్ట్ ఆఫీసులో.. ఉద్యోగుల దావత్..!

ఏ ఫంక్షన్ అయినా విందు చేసుకోవడం ఆనవాయితీ.. విందులో మద్యం, మాంసం ఉండడం మామూలే.. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో దావత్ చేసుకోవడం క్షమించరాని నేరం.. తమ ఆఫీసును గుడిలా భావించాల్సిన అధికారులు, సిబ్బంది అక్కడే దావత్ చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయ ఆవరణలో ఉన్న మైసమ్మ వారికి మేకను బలి ఇచ్చి.. మద్యంతో విందు చేసుకోవడం విమర్శలకు దారితీసింది.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తలపించింది. కొందరు అటవీశాఖ అధికారులు తమ ఆఫీసు ఆవరణలోనే దావత్ చేసుకున్నారు. అక్కడే ఉన్న మైసమ్మకు మేకను బలి ఇచ్చారు. మద్యంతో ఎంచక్కా దావత్ చేసుకుని సంతోషంగా గడిపారు. విందు చేసుకోవడంలో అభ్యంతరం ఏమీ లేనప్పటికీ.. జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలోనే మద్యం సేవించడం వివాదాస్పదంగా మారింది. అయితే, స్థానికంగా ఉన్న కొందరు టింబర్, సామిల్ డిపోల నిర్వాహకులు మందు దావత్‌కు స్పాన్సర్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో కొందరు సామిల్ నిర్వాహకులతో పాటు మరికొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు మద్యం తాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన మీడియా అక్కడికి వెళ్లడంతో.. రిపోర్టర్లను చూసి సామిల్, టింబర్ డిపోల యజమానులతోపాటు కొందరు ఫారెస్ట్ సిబ్బంది అక్కడ నుంచి జారుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై అక్కడే ఉన్న కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు దురుసుగా ప్రవర్తించారు.

మరికొందరు సిబ్బంది.. మీడియాతో విందు చేసుకోవడం తప్పా అంటూ ప్రశ్నించారు. మరో ఉద్యోగి తాను ఇడియట్‌ను అంటూ తనకు తానే తిట్టుకోవడం విశేషం.. మరో ఉద్యోగి తన ఉద్యోగం ఊడడం ఖాయమంటూ ఫోన్‌లో మరొకరికి చెప్పడం కొసమెరుపు.. కాగా ఈ ఘటనపై జిల్లా ఫారెస్ట్ అధికారి రవిప్రసాద్‌ను వివరణ కోరింది మీడియా... ఈ విషయం తనకు తెలియదని, ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై శాఖపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News