NIA Raids: తెలంగాణ సమా 10 రాష్ట్రాల్లో NIA సోదాలు.. 44 మంది అరెస్ట్

NIA Raids: అత్యధికంగా త్రిపురలో 21 మంది అరెస్ట్

Update: 2023-11-09 03:18 GMT

NIA Raids: తెలంగాణ సమా 10 రాష్ట్రాల్లో NIA సోదాలు.. 44 మంది అరెస్ట్

NIA Raids: మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి.. దేశంలో 10 రాష్ట్రాల్లో NIA సోదాలు నిర్వహించింది. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా భారతదేశంలోకి అక్రమ వలసదారుల చొరబాటు స్థిరీకరణలో పాల్గొన్న అక్రమ మానవ రవాణా మద్దతు నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేసేలా ఆపరేషన్ చేపట్టింది. గౌహతి, చెన్నై, బెంగళూరు, జైపూర్‌లోని NIA శాఖలలో 4 మానవ అక్రమ రవాణా కేసుల నమోదు తర్వాత.. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 55 ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు, దాడులు నిర్వహించింది NIA. తెలంగాణ, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలో సోదాలు చేశారు NIA అధికారులు. అక్టోబర్ 6న గౌహతిలోని NIA పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అక్రమ వలస దారుల చొరబాటు.. ఇండో-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించిందని NIA అధికారులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌కు చెందిన వివిధ మాడ్యూల్స్ తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌తో సహా వివిధ రాష్ట్రాలలో విస్తరించి.. అక్కడ నుంచి పనిచేస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని NIA స్పష్టం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల్లోని హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ మాడ్యూళ్లను ఛేదించడానికి మూడు కొత్త కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు NIA అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా బుధవారం తెల్లవారుజామునుంచి చేపట్టిన సోదాల్లో ముఖ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

మానవ అక్రమ రవాణా కేసుల్లో భాగంగా.. బుధవారం జరిపిన ఆపరేషన్‌లో మొత్తం 44 మందిని అరెస్ట్‌ చేసినట్టు NIA అధికారులు తెలిపారు. అత్యధికంగా త్రిపురలో 21 మందిని, కర్ణాటకలో 10, అస్సాంలో ఐదుగురు, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు, తమిళనాడులో ఇద్దరు, పుదుచ్చేరి, తెలంగాణ, హర్యానాలో ఒక్కొక్కరు చొప్పున అరెస్ట్ అయినట్టు వెల్లడించారు. వారి నుంచి 20 లక్షల నగదు, 4వేల 550 అమెరికన్‌ డాలర్లతో పాటు.. సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, డిజిటల్‌ పరికరాలు, ఆధార్‌, పాన్‌కార్డులు, నకిలీ గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధమైన మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల కార్యకలాపాలు, ముఠాల వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కోసం మరిన్ని దర్యాప్తు, సోదాలు కొనసాగుతాయన్న NIA అధికారులు.. అరెస్ట్‌ చేసిన నిందితులను కోర్టు ఎదుట హాజరుపరుస్తామన్నారు.

Tags:    

Similar News