Palamuru - Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్
* ప్రాజెక్టు పనులపై స్టే విధించిన ఎన్జీటీ * పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశం
Palamuru - Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ స్టే విధించింది. పనులను వెంటనే ఆపాలని అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొద్దని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆదేశించింది. అనుమతుల ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదని స్పష్టం చేసింది.
ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలు కూడా సబబుగానే ఉన్నాయని ఎన్జీటీ తెలిపింది. ఇక ఏపీ అభ్యంతరాలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని అభిప్రాయపడింది. అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే పాలమూరు-రంగారెడ్డి పనులు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణంతో రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం పడుతోందని ఏపీ ప్రభుత్వం రెండు అఫిడవిట్లు దాఖలు చేసింది. శ్రీశైలం నుంచి 90టీఎంసీల నీటిని మళ్లించి కొత్త ఆయకట్టుకు సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీచేసినట్లు అఫిడవిట్‌లో తెలిపింది.
పర్యావరణ అనుమతుల నుంచి తప్పించుకునేందుకే తాగునీటి ప్రాజెక్ట్ పేరు చెప్పి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని ఏపీ ఆరోపించింది. ఈ విషయంలో ఎన్జీటీ జోక్యం చేసుకుని పాలమూరు-రంగారెడ్డి పనులు నిలిపివేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కోరింది.