Hyderabad: హైదరాబాద్‌లో వాహనదారులకు బంపర్ ఆఫర్
Hyderabad: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో.. మొత్తం రూ.600 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు
Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల మోత మోగిస్తున్నారని వాహనదారులు లబోదిబోమంటున్న రోజులు ఇవి. ఓ రకంగా ట్రాఫిక్ పోలీసుల తీరుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఇక అలాంటి పరిస్ధితి ఉండదు. త్వరలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసేందుకు అది కూడా మొత్తం కాకుండా కొంత శాతం మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది పోలీసు శాఖ.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పెండింగ్ చలాన్లు దాదాపు 600 కోట్ల రూపాయలు ఉన్నాయి. చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పోలీసులు సైతం పునరాలోచన చేశారు. మార్చి 1 నుంచి 31 వరకు పెండింగ్ చలాన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు పోలీసులు. ద్విచక్ర వాహనాలకు 25 శాతం చలాన్లు చెల్లించి 75 శాతం మాఫీ చేయనున్నారు. కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చెల్లించే విధంగా ప్రతిపాదన చేశారు అధికారులు. ఇక ఈ పెండింగ్ చలాన్లను మీ సేవా, ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
మార్చి నెలలో స్పెషల్ డ్రైవ్ పూర్తియిన తర్వాత ఇంకా ఏ వాహనానికైనా చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులు ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.