PV Narasimha Rao: హుజూరాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సర్కారు యోచన..?

PV Narasimha Rao: అపర చాణాక్యుడిగా పేరుపొందిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.

Update: 2021-06-11 03:15 GMT

PV Narasimha Rao: హుజూరాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సర్కారు యోచన..?

PV Narasimha Rao: అపర చాణాక్యుడిగా పేరుపొందిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో హుజూరాబాద్ కొత్త జిల్లా ఏర్పాటు అంశం మళ్లీ ప్రచారంలోకి రావడం ఆసక్తి రేపుతోంది. ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుపుతున్న నేపథ్యంలో కొత్త జిల్లా డిమాండ్‌కు బలం చేకూరుతోంది. ఇంతకూ పీవీ పేరిట జిల్లా కథేంటి..? ఈ కొత్త జిల్లా వెనక ఉన్న ముచ్చటేంటి..? ఈ స్టోరీలో చూద్దాం.

తెలంగాణలో మరో కొత్త జిల్లా డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. మాజీ ప్రధాని పీవీ పేరుతో హుజురాబాద్ చుట్టు పక్కల మండలాలు కలుపుకుని కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని పీవీ స్వగ్రామమైన వంగర గ్రామస్తులు కోరుతున్నారు. తాజాగా మాజీమంత్రి ఈటల కూడా హుజూరాబాద్‌ను జిల్లా చేయాలంటూ డిమాండ్ చేశారు. 2016లో జిల్లాల పునర్విభజన సమయంలోనే హుజూరాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. అందుకోసం గ్రామస్తులు ప్రత్యేకంగా జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు పీవీ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేసిన పీవీ నామకరణం చేయాలని సర్కారు యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

హుజూరాబాద్‌కు పది కిలో మీటర్ల దూరంలో పీవీ స్వగ్రామమైన వంగర ఉంది. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పీవీ జయంతి జూన్ 28న హుజూరాబాద్ జిల్లాగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దీని కోసం సీఎం కేసీఆర్ వద్ద చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా పీవీ జిల్లాను తెరపైకి తీసుకువచ్చారని, ఇది కేవలం ఎన్నికల స్టంటేనని మరికొందరు వాదిస్తున్నారు.

పీవీ జిల్లా కోసం గతంలో పలు ఆందోళనలు జరిగాయి. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పీవీ జిల్లా ఏర్పాటు చేసి హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, వీణవంక, ఇల్లందకుంట మండలాలతో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలో కలిసిన భీమదేవరపల్లి, కమలాపూర్, ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్, చిగురుమామిడి మండలాలతో పాటు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ను కొత్త జిల్లాలో కలపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో హుజూరాబాద్‌ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో రెండు, మూడు నెలలు ఆందోళనలు నిర్వహించి దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి ఈటల గతంలో తాను వావిలాల మండలంలో ఏర్పాటుతో పాటు హుజూరాబాద్‌ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఏదేమైనా ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే జరగబోయే ఉప ఎన్నికల్లో ఆయన విజయావకాశాలను దెబ్బతీసేందుకే పీవీ జిల్లాను తెరపైకి తీసుకువచ్చారన్న ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్‌ జిల్లా ఏర్పాటు చేసి పీవీ పేరు పెడితే ఈటలకు చెక్‌ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు హుజూరాబాద్‌ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఈటల డిమాండ్ చేయడంతో కొత్త జిల్లా ఏర్పాటు వ్యవహారం హాట్‌గా మారింది. హుజురాబాద్ వేదికగా జిల్లా ఏర్పాటు ఇరువర్గాలకు రాజకీయ అస్త్రంగా మారిన నేపథ్యంలో జిల్లా ఏర్పాటు సాధ్యమేనా కాలమే తేల్చాలి.

Full View


Tags:    

Similar News