హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ చెరువులో ఆదివారం సాయంత్రం గల్లంతైన నవీన్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గంటల తరబడి గాలించి మృత దేహాన్ని బయటకు తీశారు. నిన్న గల్లంతైన ప్రదేశానికి 30 మీటర్ల దూరంలో నవీన్ మృతదేహాన్ని గుర్తించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. స్కూటీపై వెళ్తూ నిన్న సరూర్‌నగర్ చెరువులో నవీన్ గల్లంతైన సంగతి తెలిసిందే. సరూర్ నగర్ చెరువు కట్ట నుంచి తపోవన్ కాలనీ వైపు వెళ్లే దారిలో వరద నీటిలో అల్మాస్‌గూడకి చెందిన నవీన్ కుమార్ కొట్టుకుపోయాడు. నిన్న నాలా వద్ద ద్విచక్ర వాహనం మొరాయించడంతో వెనుక కూర్చున్న వ్యక్తి కిందికి దిగి దాన్ని తోసేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో అందరూ చూస్తుండగానే నవీన్ కొట్టుకుపోయాడు. నవీన్ కుమార్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. నవీన్‌కు భార్య, ఇద్దరు పిల్లున్నారు. నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.