హైదరాబాద్ లోని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా తెలంగాణ ఎమ్మెల్యేలందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మరోసారి ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో జాఫర్‌కు పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీలో సిబ్బంది, మీడియా, పోలీసులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇప్పటివరకు అసెంబ్లీవిధుల్లో ఉన్న 13 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 2,479 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కి చేరింది. మృతుల సంఖ్య 974కి పెరిగింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,27,007కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,532 యాక్టివ్ కేసులు ఉన్నాయి.