By-Elections 2021: కాసేపట్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
By-Elections 2021: అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి
By-Elections 2021: కాసేపట్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవడానికి గులాబీ పార్టీ... వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దన్న తీరుతో కాంగ్రెస్ రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకునే పనిలో బీజేపీపోటీపడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ మొదటి నుంచే ప్రచారంలో పైచేయి సాధించి ఓట్లు కొల్లగొట్టడానికి స్కెచ్ వేసింది.
నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుమారుడు నోముల భగత్ కి టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి బరిలో దింపింది. కాంగ్రెస్ మొదటగానే మాజీ ఎమ్మెల్యే జానారెడ్డికి అవకాశం ఇచ్చింది. బీజేపీ చివరి వరకు అన్ని ప్రయత్నాలు చేసి రవి కుమార్ నాయక్ ను బరిలో నిలిపింది.
ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా గులాబీ పార్టీ, హస్తం పార్టీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. మరోవైపు కాషాయ పార్టీ సాగర్‌లో సత్తా చాటాలని చూస్తోంది. దుబ్బాక లో దెబ్బతినడంతో టీఆర్ఎస్ అన్ని రకాలుగా అలర్ట్ అయింది. నాగార్జునసాగర్ నుండి ప్రతి మండలంలో గ్రామంలో పార్టీ నేతలు విరివిగా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్... వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ప్రచార సరళిని ఎప్పటికప్పుడు సమీక్షించి సూచనలు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గులాబీ పార్టీ శ్రేణులంతా సాగర్‌లో ప్రచారం నిర్వహించారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల, 20వేల, 300 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1లక్షా, 9వేల, 228 మంది, మహిళలు 1లక్షా ,11వేల, 72 మంది ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.