బోర్డు తిప్పేసిన ముద్ర అగ్రికల్చర్ అండ్ సొసైటీ.. లబోదిబోమంటున్న డిపాజిటర్లు
* నిర్మల్ జిల్లాలో లబోదిబోమంటున్న డిపాజిటర్లు * అధిక వడ్డీ ఆశ చూపించి లక్షల్లో డబ్బు సేకరణ
Mudra Agriculture and Society: అధిక వడ్డీలు, మైక్రో ఫైనాన్స్ వ్యవహారాలు నడుపుతున్న ఓ సంస్థ బోర్డు తిప్పింది. కొద్ది రోజులుగా ఆయా జిల్లాల్లో బోర్డు తిప్పుతున్న ముద్ర అగ్రికల్చర్ సొసైటీ, నిర్మల్ జల్లాలో కూడా షటర్ క్లోజ్ చేసింది. దీంతో డబ్బులు డిపాజిట్ చేసిన కస్టమర్స్ లబోదిబోమంటున్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రచారం చేశారు. అధిక వడ్డీ ఆశ కల్పించి భారీగా డిపాజిట్లను సేకరించారు. ఖాతాదారులంతా చిరు వ్యాపారులు, దినసరి కూలీలుగా తెలుస్తోంది.
డిపాజిట్ల గడువు తీరడంతో సొమ్ము చెల్లించాలని ఖాతాదారులు కోరారు. డిమాండ్స్ ఎక్కువ కావడంతో సంస్థ 15 రోజులుగా మూతపడింది. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.