అమ్మ స్పర్శే ఆయువైంది.. చనిపోయిందనుకున్న చిన్నారిని బతికించిన అమ్మ స్పర్శ
Jagtial: అమ్మ .. ఈ మాట చాలు ప్రాణం లేచి రావడానికి అమ్మ స్పర్శే ఓ మహా మృత్యుంజయ మంత్రం ఈమాటని నిజమని నిరూపించింది జగిత్యాల జిల్లాలో ఓ పసికందు.
Jagtial: అమ్మ .. ఈ మాట చాలు ప్రాణం లేచి రావడానికి అమ్మ స్పర్శే ఓ మహా మృత్యుంజయ మంత్రం ఈమాటని నిజమని నిరూపించింది జగిత్యాల జిల్లాలో ఓ పసికందు. స్మశానానికి వెళ్లి మరి అమ్మ పిలుపుతో తిరిగి ప్రాణాలతో బయటకి వచ్చింది. జగిత్యాల జిల్లాలో జరిగిన అద్భుతం అందరిన ఆశ్చర్యానికి గురిచేసింది. అవసాన దశలో ఉన్నా వారికైనా అమ్మ పిలిచే పిలుపు ఓ శక్తి ని ఇస్తుందని విన్నాం. దైవాన్ని కూడా తల్లి తరువాతే అన్న మాట అనేక సార్లు నిరూపితమైంది. ఇటీవల జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన కూడా మరోసారి అమ్మ ప్రేమకి అద్దం పట్టింది. శిశువు పుట్టిన కొద్ధి సమయంలోనే కన్నుమూసిందన్న వార్తతో ఆతల్లి తల్లడిల్లిపోయింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డను కల్లారా చూసుకోకుండానే కన్నుమూసిందా అంటూ కన్నీరు మున్నీరైంది. తన కడుపున పుట్టిన బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లిన ఆతల్లి వేదన భగవంతుడు విన్నాడో ఏమో తెలియదు గానీ అంత్య క్రియల కోసం స్మశానం వరకు వెళ్లిన బిడ్డ కన్నతల్లి స్పర్శతో కళ్లు తెరిచింది. దీంతో ఆతల్లి ఆనందానికి అవధులే లేవు.
అవును కన్నుమూసిందనుకున్న శిశువు బతికింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ ఘటన అందరిని ఆశ్చర్య పరిచింది. జగిత్యాల పట్టణానికి చెందిన సంగీత వేణుమాధవ్ దంపతులకు 5రోజుల క్రితం కోరుట్లలో ఆడబిడ్డ జన్మించింది. శిశువు అనారోగ్యంగా ఉండటంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటలేటర్ పై వైద్యం అందించిన అక్కడి వైద్యులు సోమవారి చిన్నారి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో చేసేదేమీ లేక ఆ శిశువును ఖననం చేసేందుకు తీసుకువెళ్లారు. చివరిసారిగా మృతిచెందింది అనుకున్న శిశువు బోరున విలపిస్తున్న తల్లి తన చేతుల్లోకి తీసుకోగానే ఆ చిన్నారిలో కదలిక రావడంలో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఇక తాను నవమాసాలుమోసి జన్మనిచ్చిన బిడ్డ ఇక లేదని రోదించిన తల్లి కళ్లలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన బడ్డ ప్రాణాలతో ఉందని తెలియడంతో హుటాహుటిన జగిత్యాలలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి మళ్ళీ వైద్యం అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందనీ చెబుతున్న తల్లిదండ్రులు ఈ ఘటన తమమెన్నటికీ మరిచిపోలేమని చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై శిశుసంక్షేమ అధికారులు సైతం వివరాలు సేకరించారు. వైద్యులు తప్పటడుగు వేశారో లేక అమ్మ బాధని ఆ భగవంతుడు అర్ధం చేసుకున్నాడో తెలియదు గానీ తన కన్నతల్లి స్పర్శ తగలగానే చనిపోయిందనుకున్న శిశువులో కదలికలు రావడం నిజంగా ఓ అద్బుతం అనే చెప్పాలి.