సమయం లేదు మిత్రమా.. ఓటెద్దాం రండి.. మిగిలింది రెండు గంటలే. ఇప్పుడు నిర్లక్ష్యంచేస్తే... ఐదేళ్లు భరించాలి. మనల్ని పాలించే లీడర్ ను డిసైడ్ చేసేందుకు గేటు దాటి పోలింగ్ కేంద్రానికి రండి. ప్రశ్నించే హక్కు రావాలంటే ఓటేయడం మన బాధ్యత. సోషల్ మీడియాలో కామెంట్లు విసరడం స్టేటస్ లు పెట్టుకోవడం నాయకులకు జై కొట్టడం కాదు ప్రజాస్వామ్యం అంటే... నచ్చిన హీరో సినిమా వస్తే.. థియేటర్లలో గంటలకొద్ది నిలబడతాం మన పాలకులను నిర్ణయించేందుకు టైం లేదా? ఆధునిక పోకడలతో మురిసిపోయే యువతకు ఓటు హక్కు విలువ తెలియదా ధనిక వర్గానికి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదా?. ఎందుకు గేటు దాటి రావడం లేదు?. హాలీడే రాగానే విశ్రాంతి తీసుకునే వీరులారా ఇప్పటికైనా కదిలిరండి ఓటేసిపోండి.
గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, పోలింగ్ మొదలై 9గంటలు దాటుతున్నా... ఓటింగ్ 30శాతం కూడా దాటలేదు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 25.34శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. పోలింగ్ మందకొడిగా సాగుతుండటంతో ఓటింగ్ పర్సంటేజ్ కనీసం 50శాతం దాటుతుందో లేదోనన్న అనుమానాలు నెలకొన్నాయి. ఓటేసేందుకు ఇంకా రెండు గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడైనా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తారో లేదో చూడాలి.
గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఓటేసేందుకు ఇంటి గేటు కూడా దాటడం లేదు. పోలింగ్ మొదలై 9 గంటలు దాటిపోతున్నా పోలింగ్ కేంద్రాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో, GHMC ఎన్నికల పోలింగ్ గతంలో ఎన్నడూలేనివిధంగా మందకొడిగా సాగుతోంది. సగానికి పైగా డివిజన్లలో మరీ దారుణంగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతోంది. ఓటేసేందుకు హైదరాబాదీలు అస్సలు ఆసక్తి చూపడం లేదు.
ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు, విద్యాధికులే ఓటేసేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. నగరంలోనూ, నగర శివార్లలోనూ ఓటేసింది ఎక్కువగా సామాన్యులేనని లెక్కలు చెబుతున్నాయి. ఓటేయడంలో సామాన్యుల్లో కనిపించిన చైతన్యం విద్యాధికుల్లో లేదనే మాట వినిపిస్తోంది. ఇక, ఓటేసేందుకు రెండు గంటలు మాత్రమే సమయం ఉండటంతో కనీసం ఇప్పుడైనా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేస్తారో లేదో చూడాలి.
మరో రెండు గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్నవారికి మాత్రమే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. ఆరు తర్వాత పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారికి ఓటేసేందుకు అనుమతి ఉండదు. దాంతో, సాయంత్రం 6గంటల్లోపే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయాలని యువతకు సినీ రాజకీయ ప్రముఖులు, ప్రజాస్వామ్యవాదులు, సీనియర్ సిటిజన్లు పిలుపునిస్తున్నారు.
వయోవృద్ధులు, సెలబ్రిటీస్, సినీ రాజకీయ ప్రముఖులు సైతం లైన్లలో నుంచుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రైతులు, కార్మికులు, చిరు ఉద్యోగులు సైతం ఓట్లు వేస్తున్నారు. అయితే, విద్యాధికులు, కార్పొరేట్ ఉద్యోగులు మాత్రమే ఓటేసేందుకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టడం లేదని మాట ఆందోళన కలిగిస్తోంది.