Revanth Reddy: రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని వినతి కోరని సీఎం
Revanth Reddy: వెళ్లే ముందు ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి పలు అంశాలపై వినతులు
Revanth Reddy: రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వినతులు అందించారు. తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన కొన్ని అంశాలను రేవంత్ రెడ్డి మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని.. మిగిలిన 2 వేల 400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. దీనికి కావాల్సిన అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం తెలిపారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని.. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని... భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్– రామగుండం, హైదరాబాద్–నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కారిడార్ తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని గుర్తుచేశారు.