కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వస్తుంది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే. అంతే కాదు ప్రస్తుతం ఆర్మీ మరియు ఇతర రక్షణ శాఖల్లోనూ, రక్షణ రంగాల్లోనూ మహిళలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళలు సముద్రంపై గస్తీ కోసం అర్హత సాధించారు. ముగ్గరు మహిళా పైలట్లలో లెఫ్టినెంట్ దివ్య శర్మ, లెఫ్టినెంట్ శుభాంగి, లెఫ్టినెంట్ శివాంగి ఉన్నారు.
సముద్రంపై డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో గస్తీ నిర్వహించడానికి అర్హత సాధించిన మొట్టమొదటి మహిళల బ్యాచ్ ఇదే కావడం విశేషం. గురువారం ఐఎన్‌ఎస్ గరుడలో ఈ ముగ్గురికి పట్టా ప్రదానోత్సవం జరిగింది. వీరు ముగ్గురు 27వ డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లైయింగ్ ట్రైనింగ్(డీవోఎఫ్‌టీ) కోర్సులో భాగంగా వీరు శిక్షణ పొందారు. ఈ ముగ్గురు మొదట ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్లుగా శిక్షణ పొందారు. ఆ తరువాత మొదటిసారిగా శివాంగి నౌకాదళ పైలట్‌గా 2019 డిసెంబర్ 2న అర్హత సాధించారు. తర్వాత వీరంతా ఒక బృందంగా ఏర్పడి డీవోఎఫ్‌టీ కోర్సులో చేరారు. దివ్య శర్మ ఢిల్లీ, శుభాంగి యూపీ, శివాంగి బీహార్‌కు చెందినవారు. కాగా వారికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురిని మిగతా మహిళలు ఆదర్శంగా తీసుకుని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ ముగ్గురు డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సముద్రంపై గస్తీ నిర్వహించేందుకు సిద్ధం కావడం ఎంతో సంతోషంగా ఉందని కవిత పేర్కొన్నారు.