Telangana: నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
* తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు * అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్
Telangana: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందుకోసం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. అధికార టీఆర్ఎస్‌కు సంఖ్యా బలం ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నాయి. రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు గత నెల 31న షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 29న పోలింగ్ జరగనుండగా, అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఇదివరకు పనిచేసిన ఆకుల లలిత, ఫరుదుద్దిన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ రావు, బోడకుంట వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవికాలం ఈ ఏడాది జూన్ 3తో ముగిసింది. అంతకు ముందే ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
అంతకు ముందు నుంచే ఖాళీ అయిన స్థానంలో చోటు దక్కించుకునేందుకు టీఆర్ఎస్ లోని కొంతమంది ముఖ్య నేతలు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. అభ్యర్ధుల ఎంపికపై అధికార టిఆర్‌ఎస్ పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు సమీక్షించారు. ఎమ్మెల్సీ స్థానాల కోసం ప్రధానంగా పోటీపడుతున్న నాయకుల పేర్లు, జాబితాపై ఒకటికి రెండు సార్లు చర్చించారు. ఈ కసరత్తును పూర్తి చేసి ఈనెల 15వ తేదీ కల్లా ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు ఎమ్మెల్సీ స్థానాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతల్లో తీవ్ర స్థాయిలో టెన్షన్ నెలకొంది. ఈ సారైనా ఎమ్మెల్సీ తమకు అదృష్టం వరిస్తుందా? లేదా? అన్న అంశంపై ఆశావహులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అయితే ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారిలో టిఆర్ఎస్ జాబితా చాంతాండంత ఉంది.
వారిలో అవకాశం లభించేది కేవలం ఆరుగురి మాత్రమే. దీంతో తుది జాబితాలో చోటు ఎవరికి లభిస్తుందన్నది టిఆర్‌ఎస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నది. రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్‌కు దక్కుతాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి 103, మిత్రపక్షమైన MIMకు 7 ఎమ్మెల్యేలు మొత్తం కలిపి 110 ఎమ్మెల్యేల బలం ఉంది.
కాంగ్రెస్ ఆరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీకి పది మందికి పైగా ఎమ్మెల్యేల ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆరు స్థానాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలంతోనే ఏకగ్రీవం కానున్నాయి.