MLA'S Scared To Enter Kamareddy Camp Office : కామారెడ్డి క్యాంప్‌ ఆఫీసు ఎంట్రీకి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో భయమేల?

Update: 2020-07-24 12:40 GMT

ఆ క్యాంప్ కార్యాలయాలకు వెళ్లాలంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు భయపడిపోతున్నారు..? ఆయనే కాదు కార్యకర్తలు సైతం అందులో ఎంట్రీకి ఎందుకు జంకుతున్నారు? నూతనంగా నిర్మించిన ఆ భవనాల్లోకి వెళ్లేందుకు, ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం వెనుక అసలు కారణమేంటి?

కామారెడ్డి జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ క్యాంప్ కార్యాలయాల్లోకి అడుగు పెట్టేందుకు నసేమిరా అంటున్నారట. వాటి వైపు చూసేందుకే ఇష్టపడటం లేదట. జిల్లా కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ తన క్యాంప్ కార్యాలయాన్ని, వడ్లూర్ రోడ్డులోని నూతన కలెక్టరేట్ కు సమీపంలో నిర్మించారట. అన్ని హంగులతో అత్యాధునిక డిజైన్‌తో నిర్మించిన ఆ క్యాంప్ కార్యాలయాన్ని, మంత్రి హోదాలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి 2018లో ప్రారంభించారట. ఇక ఆ రోజు అందులో అడుగు పెట్టిన సదరు ఎమ్మెల్యే, ఇక అటువైపు కన్నెత్తి చూడటం లేదట. ఆయనే కాదు, కార్యకర్తలకు సైతం నో ఎంట్రీ అంటున్నారట. ఎమ్మెల్యే కొత్త ఇంట్లోకి వెళ్లకపోవడానికి కారణం ఉందంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం, కార్యకర్తలకు అందుబాటులో ప్రస్తుతం ఎమ్మెల్యేకు ఇల్లు ఉండంటతో, దూరంలో ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదట. సెంటిమెంట్‌గా, ప్రస్తుతం ఉన్న ఇల్లు, గంపా గోవర్ధన్ కు కలిసొచ్చిందట. అందుకే ఆ కొత్త ఇంట్లో గృహ ప్రవేశానికి ఇంకా టైం కోసం వేచి చూస్తున్నారట.

ఇక క్యాంప్ ఆఫీసుకు వెళ్లేందుకు ససేమిరా అంటున్న మరో ఎమ్మెల్యే జాజుల సురేందర్. ఎల్లారెడ్డి శాసన సభ్యుడు జాజుల సైతం, తన క్యాంప్ కార్యాలయంలోకి అడుగు పెట్టడం లేదట. వాస్తు దోషం కారణంగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టేందుకు ఒప్పుకోవడం లేదట సదరు ఎమ్మెల్యే. గతేడాది దసరా రోజున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని, సురేందర్ ప్రారంభించారు. అప్పుడు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారట. అప్పటి నుంచి అందులో అడుగు పెట్టడం లేదట. ఎమ్మెల్యేనే వెళ్లకపోవడంతో, కార్యకర్తలు సైతం తమకు ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ వారు కూడా క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లడం మానేశారట. అప్పటి నుంచి ఇలా తాళాలతో వెక్కిరిస్తోంది క్యాంప్ ఆఫీసు.

నెలల తరబడి దానిని తెరవకపోవడంతో బూజు పట్టి పోయిందట. ఈ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి భూమి పూజ చేశారు. అయితే ఎన్నికల్లో ఆ మాజీ ఎమ్మెల్యేకు, ఆ క్యాంప్ కార్యాలయం పనులను ప్రారంభించడం కలిసి రాలేదని లోకల్‌గా టాక్ నడుస్తోంది. దీంతో ఆ వాస్తు ఎఫెక్ట్ ఎక్కడ తన మీదకు వస్తుందేమోనన్న ఉద్దేశంతో, తాజా ఎమ్మెల్యే అందులోకి వెళ్లడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారన్న టాక్ పార్టీలో నడుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని చోట్లా క్యాంప్ కార్యాలయాలు ప్రారంభించి, అక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తున్నారు. అన్ని కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా ఉంటే, కామారెడ్డి జిల్లాలోని రెండు క్యాంప్ కార్యాలయాలు మాత్రం ఉన్నా లేనట్టుగా మారాయనే చర్చ జరుగుతోంది. వాస్తుదోషం ఎఫెక్టుతో ఒకరు కార్యాలయానికి నో ఎంట్రీ అంటుంటే, మరొకరు మాత్రం దూర భారం పేరుతో అందులో వెళ్లేందుకు జంకుతున్నారట. అసలు ఎమ్మెల్యేలు ఇంకా ఎన్ని రోజులకు అందులో అడుగు పెడతారో కాలమే తేల్చాలి.

Full View



Tags:    

Similar News