LB Nagar: మహిళ అధికారి కి ఎమ్మెల్యే అనుచరుడి వార్నింగ్
LB Nagar: తరచూ వివాదాస్పద అంశాల్లో ఎమ్మెల్యే అనుచరుడు రఘువీర్ రెడ్డి...
LB Nagar: హయత్‌నగర్ సర్కిల్-3 కార్యాలయంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి నానా హంగామా చేశాడు. బంజారా కాలనీలో వందగజాల స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకురావాలని నానా యాగీ చేశాడు. చెప్పిన పనిచేయకపోతే బదిలీ చేయిస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేకాదు... మహిళలైనంతమాత్రాన గౌరవం ఇవ్వాలా? అంటూ చిందులు తొక్కాడు.
హయత్‌నగర్ బంజారాకాలనీలో ఓ 100 గజాల స్థలం తమదేనంటూ.. ఆ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించారని, దానిని కూల్చివేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. జక్కిడి రఘువీర్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ టీపీఎస్ ఉమా జంజారాకాలనీలోని రేకుల ఇంటిని కూల్చివేశారు. అనంతరం ఆ ఇంటి యజమానులు తమ వద్ద ఉన్న సేల్‌డీడ్ పత్రాలను అధికారులకు అందజేశారు. కొంత కాలం తరువాత తిరిగి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని అందులో నివాసం ఉంటున్నారు. అయితే తను ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాగ్వాదానికి దిగాడు.
టీపీఎస్ ఉమా పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని, అది తమ పని కాదని సమాధానం ఇచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయిన రఘువీర్‌రెడ్డి మీరున్నది ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ.. మీ సంగతి చూస్తానంటూ.. వారం రోజుల్లో ఇక్కడి నుండి ట్రాన్స్‌ఫర్ చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.
హయత్‌నగర్ బంజారాకాలనీలోని సర్వేనంబర్ 62/ఎ.ఎ లో 100 గజాల స్థలాన్ని ప్రభుత్వం చాకలి సురేష్‌కు కేటాయించింది. అయితే చాకలి సురేష్ బానోతు భారతికి సేల్‌డీడ్ చేశాడు. సేల్‌డీడ్‌కు సంబంధించిన పత్రాలను బానోతు భారతి టౌన్‌ప్లానింగ్ అధికారులకు అందజేసింది. అయితే బానోతు భారతి పేరు మీద ఉన్న ప్లాటు రఘువీర్‌రెడ్డికి ఎలా ఉంటుందని.. ఒకవేళ తన పేరుమీద కూడా పత్రాలు ఉంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలి.. లేదా కోర్టులో కేసు వేసుకోవాలని అధికారుల సూచించారు.
ఎమ్మెల్యే అనుచరుడిననే గర్వంతో అధికారులపై చిందులు వేయడమేమిటని పరిసరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన జక్కిడి రఘువీర్‌రెడ్డిపై ఇప్పటికే పలు వివాదాలలో సంబంధం ఉందని సమాచారం. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో తన భార్య పెట్టిన క్రిమినల్ కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా పెండింగ్‌లో ఉంది. తరచూ వివాదస్పద కేసుల్లో నిందితుడిగా జక్కిడి రఘువీర్‌రెడ్డిని ఎమ్మెల్యే సుధీర్‌రరెడ్డి కాపాడుతూ వస్తున్నారని సమాచారం. నేర చరిత్ర ఉన్న జక్కిడి రఘువీర్‌రెడ్డిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు.