Telangana: కాసేపట్లో కరోనా నియంత్రణపై తెలంగాణ మంత్రుల సమీక్ష
Telangana: కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో.. మరోసారి ఫీవర్ సర్వేపై నిర్ణయం తీసుకునే అవకాశం.
Telangana: కాసేపట్లో కరోనా నియంత్రణపై తెలంగాణ మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి సమావేశంలో పాల్గొననున్నారు. జిల్లాల్లో వైరస్ వ్యాప్తి, కరోనా కట్టడిపై చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. కరోనా పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యశాఖ అధికారులు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. జిల్లాల వారీగా కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై చర్చించనున్నారు. కరోనా కట్టడికి చర్యలు, వ్యాక్సినేషన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా.. అధికారులను ఆదేశించనున్నారు.
రోజువారీ కేసులకు అనుగుణంగా ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, బెడ్స్ సంఖ్యను పెంచడం, చాలినన్ని ఆక్సిజన్ నిల్వలు, ఐసీయూల్లో వినియోగించే పరికరాలను అందుబాటులో ఉంచుకోవడం, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయడం, 15-18 వయస్సున్న వారికి అందజేస్తోన్న టీకాల పర్యవేక్షణ.. వంటి కీలక అంశాలపై మంత్రులు ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలను తీసుకునేలా జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులకు తగిన ఆదేశాలను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.