పట్టా.. మా హక్కు.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
Telangana Assembly: అసెంబ్లీలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి సీతక్క.
Telangana Assembly: అసెంబ్లీలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ఇచ్చిన పోడు పట్టాలు మంత్రి సీతక్క తండ్రికి కూడా వచ్చిందని అనిల్ జాదవ్ వ్యాఖ్యలు చేయగా.. అది తమ హక్కు అన్నారు. తన తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని పోడు వ్యవసాయం చేస్తే.. చట్టం ప్రకారం దక్కిన పట్టా అని తెలిపారు.
ఈరోజు కూడా తన తండ్రి అడవిలో పని చేసుకుంటున్నారని చెప్పారు. అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలు తమవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు రైతుబంధు తీసుకుంటున్నారని చెప్పారు. కానీ తాను ఒక ఆదివాసీ అయినందుకే తన తల్లిదండ్రుల పోడుభూముల హక్కులపై బీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసింది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్లు చెబుతున్నారు. 1976లో ఇందిరమ్మ తీసుకొచ్చి రిజర్వేషన్‌తో అనిల్ జాదవ్ ఎమ్మెల్యే అయ్యారు. ఎస్టీలకు లోకల్ రిజర్వేషన్లు తీసేసినట్టు మాట్లాడారు. జీవో నంబర్ 3 ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మీరు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ కూడా కోర్టులో ఉంది. వందల ఏండ్లుగా అడవుల్లో బతుకుతున్న ఆదివాసీ, గిరిజన వర్గాలకు పోడు భూముల చట్టం 2006 ద్వారా సోనియా, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వారికి హక్కు కల్పించారని సీతక్క గుర్తు చేశారు.