కేసీఆర్ ఆదేశాలతో ఎల్లుండి ఖమ్మం పర్యటకు మంత్రి కేటీఆర్
Minister KTR: మంత్రి కేటీఆర్ ను విందుకు ఆహ్వానించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Minister KTR: గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్రమంతా ఒక ఎత్తు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి మరోఎత్తు అన్నట్లు ఉంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఆ జిల్లాపై రాజకీయంగా పట్టుసాధించేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా చేతికి చిక్కినట్టే చిక్కి, కేసీఆర్‌కు చికాగు కల్గిస్తోంది. మరోవైపు సొంత పార్టీలో గ్రూపు తగాదాలు ఉండటంతో ప్రతిపక్షాలు పట్టు బిగించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఉన్న నేతలు కూడా చివరకి ఇతర పార్టీల్లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్.
జిల్లాలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు ఎల్లుండి మంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్ వెలుతున్నారు. అయితే అక్కడ ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి ఎలాంటి పదవులు లేకుండా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలతో వారి అడుగులు ఎటువైపు పడతాయో అనే సందేహాలు కారు పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. పార్టీ క్షేత్ర స్థాయిలో పట్టున్న నేతలు తుమ్మల, పొంగులేటి తాము టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామంటూనే పరోక్షంగా సొంత పార్టీ నాయకులపై కామెంట్స్ చేస్తు్న్నారు. అనుచరవర్గంతోపాటు ఆర్థికంగాను బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస రెడ్డి బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అలెర్ట్ అయిన టీఆర్ఎస్ అధిష్టానం అక్కడ పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడింది. మరోవైపు పొంగులేటి మాత్రం తాను పార్టీ మారబోనని స్పష్టం చేస్తున్నారు.
ఎల్లుండి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్‌కు పొంగులేని శ్రీనివాస్ రెడ్డి విందు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల ఉన్నప్పటికీ విందుకోసం పొంగులేటి ఇంటికి కేటీఆర్ వెళ్లేందుకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ టూర్‌పై గులాబీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పొంగులేటి కూడా అవకాశమో లేదా పదవులపై కేటీఆర్ నుంచి హామి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.