ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో పెరుగుతున్న రాజకీయ వేడి

Update: 2020-10-05 08:30 GMT

ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో ఈ రెండింటికి ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ఇప్పటినుంచే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం గట్టిగా కసరత్తు చేస్తోంది. గతంలో రెండు స్థానాల్లో ఓడిపోవడంతో టీఆర్ ఎస్ పరువు పోయింది. ఈ సారి ఆ పరిస్థితి ఎదురుకావొద్దని మంత్రి కేటీఆర్ కృతనిశ్చయంగా వున్నారు. ఓటరు నమోదు నుంచి మొదలుకొని ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు.

వచ్చే ఏడాది మార్చిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ ఎస్ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. గతంలో ఈ రెండు స్థానాల్లో టీఆర్ ఎస్ ఓడిపోవడంతో యువతలో టీఆర్ ఎస్ కు పట్టులేదని ప్రచారం జరిగింది. ఈ సారి అలాంటి పరిస్థితి టీఆర్ ఎస్ కు ఎదురుకావొద్దని ఆరు నెలల ముందు నుంచే కేటీఆర్ ప్లాన్ మొదలుపెట్టారు.

లక్షలాది మంది యువత ప్రాతినిధ్యం వహించే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల విషయంలో టీఆర్ ఎస్ మొదటి నుంచి ఇబ్బంది ఎదుర్కొంటుంది. గత సారి జరిగిన గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ సీటును టీఆర్ ఎస్ కైవసం చేసుకోగా, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సీటును బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచందర్ రావు గెలిచారు. టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన ఉద్యోగ సంఘం నాయకుడు దేవిప్రసాద్ ను ఓడించారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానంలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించారు. మండలిలో వీరిద్దరూ తమ పార్టీల తరపున ప్రతిపక్ష నేతలుగా ఉంటూ సర్కార్ ను నిలదీస్తున్నారు. ఈ సారి ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వొద్దని కేటీఆర్ పట్టుదలగా ఉన్నారు.

రెండు పట్టభద్రుల స్థానాలకు అక్టోబర్ 1 నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఎన్నికలను ఇజ్జత్ కా సవాల్ గా టీఆర్ ఎస్ తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గులాబీ నేతలు పోటీపడి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం కేతనం ఎగురవేయాలని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గులాబీ నాయకులకు కేటీఆర్ ఆదేశించారు. టీఆర్ ఎస్ సానుభూతిపరులను ఓటర్ గా నమోదు చేయించి ఓటు వేయించాలని షరతు విధించడంతో గులాబీ నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

పట్టభద్రుల ఎన్నికల్లో కోదండరాం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరైనా ఛాన్స్ ఇవ్వరాదని, టీఆర్ ఎస్ బలపరిచే అభ్యర్థులు గెలిచేలా కేటీఆర్ మేధోమథనం చేస్తున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే ఒక్కో టీఆర్ ఎస్ కార్పొరేట్ అభ్యర్థి మూడు వేల మంది విద్యావంతుల చేత ఓటర్లుగా పేర్లు నమోదు చేయించాలని షరతు పెట్టారు. దీంతో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలను కేటీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం అవుతోంది.

Tags:    

Similar News