కేటీఆర్, డీకే శివకుమార్ మధ్య ఆసక్తికరమైన ట్వీట్ వార్
Twitter Challenge: కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది.
Twitter Challenge: కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. శివ కుమార్ ఇచ్చిన రిప్లయ్ కు అదే తరహాలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఖాతాబుక్ సీఈఓ ఆవేదన వ్యక్తం చేయడంతో, వెంటనే మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండి అంటూ మొన్న కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై సోమవారం శివకుమార్ స్పందించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని సవాల్‌గా తీసుకుంటామని డీకే అంగీకరించారు. 2023 చివరి నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకువస్తామని ధీమాగా చెప్పారు శివకుమార్.
ఆ ట్వీట్‌ను చూసిన కాసేపటికే కేటీఆర్ స్పందించారు. శివకుమార్‌ను అన్నా అంటూ సంబోధిస్తూ కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు. కర్ణాటక రాజకీయాల గురించి తనకేమీ పెద్దగా తెలియదని చెప్పారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచేదెవరన్న విషయాన్ని పక్కనపెట్టి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిద్దామని కేటీఆర్ ట్వీట్ చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు దేశాభివృద్ధికి పాటు పడదామని కోరారు. ముందుగా ఇన్‌ఫ్రా, ఐటీ, బయో టెక్నాలజీ మీద దృష్టి పెట్టాలని శివకుమార్ కు సూచించారు. అది మరిచి హలాల్, హిజాబ్‌ల మీద దృష్టి సారించొద్దని సలహా ఇచ్చారు.