Minister Harish Rao with Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యతో ముచ్చటించిన మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao with Vanajeevi Ramaiah : వనజీవి రామయ్య ఈయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈయన ఓ ప్రకృతి ప్రేమికుడు, ఇప్పటికే ఆయన కోటికి పైగా మొక్కలను నాటి పద్మశ్రీ అవార్డును కూడా తీసున్నారు. దీంతో అర్థం అవుతుంది ఆయనకు మొక్కలు అన్నా, ప్రకృతి అన్నా ఎంత ఇష్టమో. ఈ క్రమంలోనే రామయ్య సిద్దిపేట జిల్లా అడవుల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అలా వచ్చిన వనజీవి దంపతులతో మంత్రి హరీష్‌రావు శనివారం ఉదయం ముచ్చటిస్తూ అల్పాహారం ఇచ్చారు. ఈ సందర్భంగా రామయ్యతో మంత్రి మాట్లాడుతూ ఆయన జీవనస్థితిగతుల గురించి ఆరా తీసి తెలుసుకున్నారు. ఎన్ని ఏండ్ల నుంచి వారు మొక్కలు నాటుతున్నారు. మొక్కలపై ఎందుకు అంత ప్రేమ పెంచుకుని ఎందుకు నాటాలనిపించింది. మీ బతుకుదెరువు ఏంటి అని రామయ్యను హరీష్‌రావు అడిగారు.
ఆయన అగిడిన ప్రశ్నలకు వనజీవి రామయ్య బదులిస్తూ తనకు ఐదేండ్లు ఉన్న సమయం నుంచే వనం అంటే ఇష్టపడేవాడిని అని తెలిపారు. మొక్కల నుంచి పూలు, పండ్లు, ఔషధాలతో పాటు స్వచ్ఛమైన గాలి కూడా వస్తుందన్నారు. మానవ మనుగడకు చెట్లే కీలకం కాబట్టి.. చిన్నప్పట్నుంచి మొక్కలు నాటుతున్నాను అని చెప్పారు. కన్నతల్లి లాంటి చెట్టును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటి వరకు కోటి మొక్కలు నాటానని ఇంతటితో ఆపకుండా ఆయన భవిష్యత్‌లో సీడ్‌తో మరో 3 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నానని రామయ్య స్పష్టం చేశారు. ఇక బతుకుదెరువు విషయానికి వస్తే గతంలో వ్యవసాయం చేసేవాడినని ఆయన చెప్పారు. వ్యవసాయంలో నష్టం రావడంతో దాన్ని పూర్తిగా వదిలేశానన్నారు. ఇప్పుడు తన కుమారుడు వ్యవసాయం చూసుకుంటున్నాడని తెలిపారు.
అనంతరం మళ్లీ మంత్రి మాట్లాడుతూ మీరు ఈ సమాజానికి గొప్ప ఆదర్శప్రాయులు అని రామయ్యతో చెప్పుకొచ్చారు. ప్రజాప్రతినిధులు వనజీవి రామయ్య జీవితం, మొక్కలపై ఆయనుకున్న మక్కువ, వాటిని ఎలా పెంచుతున్నారనేది తెలుసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.