Harish Rao: అందుకే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్...
Harish Rao: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజే బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది.
Harish Rao: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజే బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్‌లను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. శాసనసభ వెల్‌లోకి వచ్చినందునే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీలో సీఎం చెప్పారని ఆయన గుర్తు చేశారు.
వెల్‌లోకి ఏ పార్టీ సభ్యుడు వచ్చినా సస్పెన్షన్ వేటు తప్పదని గత సమావేశాల సందర్భంగానే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్పామని తెలిపారు. ఈ క్రమంలో వెల్‌లోకి వెళితే ఎలాగూ తమను సస్పెండ్ చేస్తారన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి రాలేదు కాబట్టే వారిని సస్పెండ్ చేయలేదు అని స్పష్టం చేశారు. తమ స్థానంలో నిలబడి అడిగితేనే రాజ్యసభలో 12 మందిపై చర్యలు తీసుకున్నారు. ఢిల్లీకి ఒక న్యాయం.. రాష్ట్రానికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ స్పీచ్ సమయంలో వెల్‌లోకి సభ్యులు ఎవరూ రావొద్దనే అంశాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు.