మరో 4 రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలి టిమ్స్.. మంత్రి ఈటల
కరోనా లక్షణాలు ఉంటే తప్ప ఎవరూ కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవద్దని ప్రజలకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరోనా లక్షణాలు ఉంటే తప్ప ఎవరూ కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవద్దని ప్రజలకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్ కరోనా ఆస్పత్రిని మంత్రి ఈటల బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా పరీక్షల విషయంలో అనవసరంగా ఎవరూ ఆస్పత్రులకు రావద్దని ఆయన ప్రజలను సూచించారు. మరో నాలుగు రోజుల్లో టిమ్స్ కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే టిమ్స్‌లో అవుట్ పేషంట్ విభాగం నడుస్తోందని ఈటల అన్నారు. ఇక ప్రజలు తమ సొంత డబ్బుతో అయినా అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేయించుకోవద్దని కోరారు.
టిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఉపయోగిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే టిమ్స్‌లో పని చేసే వైద్య సిబ్బంది, డాక్టర్లకు మంచి క్యాంటిన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఆస్పత్రిలో ఇప్పటికే వెయ్యి పడకలకు ఆక్సీజన్ సౌకర్యం కల్పిస్తున్నామని, మరో 50 పడకలకు వెంటిలేటర్ల సౌకర్యం ఉందని తెలిపారు. ఆరోగ్య రంగంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పోటీపడుతున్నట్లు వెల్లడించారు.
కరోనా బాధితులను వైద్యులు ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారని ఈటల గుర్తు చేశారు. గాంధీ ఆస్పత్రిలో వందలాది ఇన్‌పేషంట్లకు చికిత్స అందిస్తున్నామని గుర్తు చేశారు. అలాంటి ఆస్పత్రిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో, నేరుగా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన వారిని చూసేందుకు కనీసం దగ్గరి వాళ్లు కూడా రావట్లేదు. కానీ, పారిశుద్ధ్య కార్మికులు ఆ శవాలను చేరవేస్తున్నాయని తెలిపారు. గాంధీ వైద్యులు, సిబ్బందిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
ఇక తెలంగాణలో గడిచిన నాలుగు నెలల కాలంలో కరోనా బారిన పడి 210 మంది చనిపోయారని గుర్తు చేశారు. చనిపోయిన వారందరికీ కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత జబ్బులు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారే కరోనాకు తట్టుకోలేక మరణించినట్లుగా ఈటల చెప్పారు. దీనిపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్‌పై తెలంగాణ చిత్రశుద్దిని ఎవరూ శంకించవద్దని అన్నారు.