Medaram Jatara 2022: మేడారం భక్తకోటికి సకల సౌకర్యాలు
Medaram Jatara 2022: జాతర 4 రోజుల్లో కోటిన్నరమందికిపైగా భక్తులు వచ్చే అవకాశం
Medaram Jatara 2022: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడారం సమ్మక్క జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఈసారి జాతరలో సాంకేతికతను మరింతగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 3లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తోంది. మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 18న వస్తారనే సమాచారం ఉందని మంత్రి తెలిపారు.
కరోనా కారణంగా భక్తులు ముందుస్తు దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు. జాతరకు రోజుకు 3లక్షల వరకు భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జంపన్నవాగు విషయంలో గతంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జాతరలో మెడికల్ శిబిరాలు, మాస్కులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. షిప్ట్వైజ్గా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బయోటాయిలెట్లు-రెగ్యులర్ టాయిలెల్స్ అందుబాటులో ఉంచారు. భక్తులు గంటలపాటు క్యూ లైన్లలో నిల్చోకుండా అరగంటలో దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వీఐపీ పాస్‌పై టైమింగ్ స్లాట్ కేటాయిస్తున్నారు.
మొత్తం 4 రోజుల పాటు జరిగే జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు హాజరుకానున్నారు. జాతరకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం దాదాపు 8వేల బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. జాతర ముగిసేవరకు దాదాపు కోటిన్నర మందికిపైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా జాతరకు శాశ్వత సదుపాయల కల్పనకు మరో 200 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎకరానికి 6 వేల చొప్పున రైతులకు నిధులు ఇస్తున్నామని ఇలా మొత్తం 1100 ఎకరాలకు ఇప్పటికే ఇచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు.