Maoists Warning Letter : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు అక్కడక్కడా అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సారి మావోయిస్టులు కలకలం రేపారు. తమ ఉనికిని మరోసారి చాటుకునేందుకు లేఖలు ద్వారా తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. భూపాలపల్లి ఏరియా కమిటి, ఏటూరునాగారం, ఉంగా పేరుతో గోడ పత్రికలను అంటించారు. మావోల పేరుతో షాపల్లి గ్రామంలోని ఇంటి గోడలకు అంటించిన వాల్ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ లేఖలో మావోయిస్టులు ఏం రాశారంటే మావోయిస్టుల ఏరివేతకు తెలంగాణ ప్రభుత్వం పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టించడం వెంటనే ఆపేయాలని అన్నారు. ఇప్పటికైనా అడవుల్లో చేపట్టిన కూంబింగ్స్ ఆపకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వర రావుకు పట్టిన గతే టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు పడుతుందని హెచ్చరించారు.
కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పెంచతూ ప్రజల పై అక్రమ కేసులు పెడుతూ బలి చేస్తున్న కేసీఆర్...అంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు అడిగితె అక్రమ అరెస్టులు చేయిస్తున్నాడన్నారు. వీరిని హెచ్చరించడం మాత్రమే కాకుండా మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్‌ను కూడా మావోలు హెచ్చరించారు. సంపత్ పోలీసులను తన బొలేరో వాహనంలో తిప్పడం పద్ధతి కాదన్నారు. ఫారెస్ట్ అధికారులు డీఆర్వో ప్రహ్లాద్, రవిందర్, సందీప్ లు ఇంకా చాలా మంది పద్ధతి మార్చుకోవాలని మావోల లేఖలో పేర్కొన్నారు. వారు మారనట్టైతే ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఇక పోతే టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు రెండురోజుల క్రితం మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని ఇంటికి వెళ్లిన మావోలు ముందుగా వారిని బెదిరించారు. ఆ తరువాత హత్య చేశారు. అయితే మొన్నటికి మొన్న టీఆర్ఎస్ నేతను చంపిన ములుగు జిల్లాలోనే మరోసారి మావోయిస్టులు లేఖలను వదలడం ఇప్పుడు మరింత ఆందోళన నెలకొంది. ఈ లేఖపై అటు పోలీసులు ఉన్నతాధికారులు సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.