హైదరాబాద్ నగరంలో రెండు రోజుల క్రితం అంటే గురువారం రోజున ఓ నిరుద్యోగి రవీంద్ర భారతి ఎదుట పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఉద్యోగం పోయిందని మనస్తాపం చెంది పెట్రోల్ పోసుకొని ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నడిరోడ్డుపై అసెంబ్లీ సమీపంలో అందరూ చూస్తుండగానే నిప్పంటించుకున్న నాగులు అనే వ్యక్తి ఈ రోజు అంటే శనివారం రోజున చనిపోయాడు. అయితే అతను నిప్పంటించుకునే సమయంలో జై తెలంగాణ అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, తన జీవితంలో ఏం చేయలేకపోయానని ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్న నాగులు ఆవేదన చెందాడు. 'కేసీఆర్ సార్.. జై తెలంగాణ అంటూ' నినాదాలు చేశాడు. తమను ఆదుకోవాలంటూ చేతులు జోడించి ప్రాదేయపడుతూ బోరున విలపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ప్రజలందరూ అలా చూస్తుండగానే ఒంటికి నిప్పంటించుకున్నాడు. బందోబస్తు డ్యూటీలో భాగంగా అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆ సంఘటనను గమనించి అతణ్ని ఆటోలో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. అతని ఒంటిపైన కాలిన గాయాలు ఎక్కువ కావడంతో పరిస్థితి విషమించి శనివారం మధ్యాహ్నం మరణించాడు.
బాధితుడు మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ వాసిగా గుర్తించారు. అబిడ్స్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసేవాడు. అయితే కరోనా కారణంగా పెట్టిన లాక్‌డౌన్ వల్ల నాగులు ఉపాధి కోల్పోయాడు. దాంతో కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. ఉపాధి దొరకకపోవడంతో విసుగుచెందిన నాగులు రవీంద్రభారతి వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నాగులు మృతిపై ఘాటుగా స్పందించారు. నాగులు కావాలని ఆత్మహత్య చేసుకోలేదని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని అన్నారు. అతని మరణానికి ప్రభుత్వమే కారణమని నిందించారు. అమరవీరుల ఆత్మత్యాగాలతో వచ్చిన తెలంగాణ ఫలితాలు ఒక్క సీఎం కుటుంబానికి దక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని నాగులు చెప్పాడని గుర్తు చేశారు.