Mahabubnagar: ఊహించని ఘటన.. చిరుతపై రివర్స్ అయిన పశువులు
Mahabubnagar: ఎదురుగా పశువుల మంద.. పక్కనే వేట కోసం మాటేసిన చిరుత ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది.?
Mahabubnagar: ఎదురుగా పశువుల మంద.. పక్కనే వేట కోసం మాటేసిన చిరుత ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది.? మహా అయితే ఆ మందలో కనీసం ఒక పశువు చిరుతకు ఆహారం అయిపోయి ఉంటుంది. అందరూ అనుకునేది ఇదే అయినా జరిగింది మాత్రం వేరు.! పశువుల మందపై పంజా విసురుదామనుకున్న చిరుతకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గేదెల గుంపు ఎదురు తిరగడంతో మరణం అంచుల వరకూ వెళ్లింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది మాత్రం ఇదే.!
ఇలాంటి దృశ్యాలు డిస్కవరీ ఛానెల్‌లోనో, యానిమల్ ప్లానెట్‌లోనో మాత్రమే కనిపిస్తాయి. సింహం, పులి, చిరుత లాంటి క్రూర మృగాలు ఎదురుపడితే సరెండర్ అవ్వడమే కాని ఎదురు తిరగడం వన్యప్రాణులకు సాధ్యం కాని పని అలాంటిది, వేట కోసం మాటేసిన ఓ చిరుతకు ప్రాణ భయం ఎలా ఉంటుందో చూపించింది ఓ గేదెల గుంపు. మహబూబ్‌నగర్ జిల్లా, బూర్గుపల్లి శివారులో దూసుకొచ్చిన చిరుతను కాళ్లతో తొక్కి పడేశాయి కొన్ని గేదెలు.
బూర్గుపల్లి శివారులో నిన్న తెల్లవారు జామున మేతకోసం వెళ్లిన పశువులకు ఊహించని ఆపద ఎదురైంది. పొదలమాటుల నక్కి నక్కి ఉన్న చిరుతపులి తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తించాయో ఏమో.! వెంటనే అలర్ట్ అయ్యాయి. ఇంతకు ముందెన్నడూ చిరుతను చూడలేదో దాని బలం తెలియదో కానీ ఒక్కసారిగా చిరుతపై రివర్స్ అయ్యాయి. ఇంకేముందీ ఊహించని ఘటన నుంచి తేరుకునేలోపే చిరుత తీవ్రంగా గాయపడి నడివలేని స్థితికి చేరుకుంది.
పశువుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిరుత గంటల తరబడి కదల్లేని స్థితిలోనే ఉండిపోయింది. నడుముతో పాటూ వెనుక కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో చిరుత నడవలేక అక్కడే కొనఊపిరితో కొట్టుమిట్టాడింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతకు చికిత్స అందించేందుకు రంగం సిద్ధం చేశారు. చిరుతను హైదరాబాద్ జూకు తరలించి అక్కడి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. చిరుత కోలుకున్న అనంతరం మళ్లీ అడవిలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.
ఇక ఈ యుద్ధంలో ఐకమత్యంగా ఉండడం వల్లే పశువులు ప్రమాదం నుంచి గట్టెక్కాయని చెప్పాలి. ఏ మాత్రం ఓటమిని అంగీకరించినా చిరుత వేటకు బలైపోయేవి అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.