టీఆర్‌ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. ఎమ్మెల్యే వల్లే కౌన్సిలర్ చనిపోయాడంటూ..
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని పత్తిపాక వద్ద దుండగులు గొడ్డళ్లతో నరికిచంపారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజన కౌన్సిలర్‌ను సిటీ నడిబొడ్డున హత్య చేయడం కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా దవాఖానకు తరలించారు. మానుకోటలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల కోసం గిరిజన రైతులకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా బాధిత గిరిజన రైతుల పక్షాన కౌన్సిలర్ బానోత్ రవినాయక్ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. గిరిజన మహిళలతో కలిసి పట్టణంలో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.
కౌన్సిలర్ హత్య కేసులో రాజకీయ కోణం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. రవి మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై రవి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వల్లే కౌన్సిలర్ చనిపోయాడంటూ కుటుంబీకులు దుమ్మెత్తి పోశారు. అయితే కౌన్సిలర్ హత్యకు భూతగాదాలే కారణమని పోలీసులు చెబుతున్నారు.