Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srisailam: అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు * శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయ పరిసరాలు
Srisailam: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పుణ్యక్షేత్రంలో శివనామ స్మరణలు మిన్నంటుతున్నాయి. యాగశాల ప్రవేశంతో మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేద పండితులు అంకురార్పణ చేయగా.. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం.. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిత్యం మల్లన్నకు వాహన సేవలు జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ తేదీన మల్లన్నకు భ్రుంగివాహన సేవ, 6న హంస వాహనసేవ, 7వ తేదీన మయూర వాహనసేవ, 8న రావణ వాహనసేవ నిర్వహించనున్నారు. 9వ తేదీన స్వామి, అమ్మవార్లకు పుష్పపల్లకి సేవ నిర్వహిస్తారు. అలాగే.. 10న గజవాహనసేవ ఉంటుంది. ఇక.. అదే రోజు ఏపీ ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
మహా శివరాత్రి సందర్బంగా 11వ తేదీన స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం నిర్వహించే ప్రభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అదే సమయంలో స్వామి, అమ్మవార్లకు నంది వాహనసేవ జరగనుంది. స్వామివారి లింగోద్భవ కాల సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగా అలంకరణ ఉంటుంది. అదే రోజు రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం జరగనుంది.
ఇక.. ఉత్సవాల్లో భాగంగా 12వ తేదీన స్వామివారి రథోత్సవం, స్వామి, అమ్మవార్లల తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతాయి. 13న పూర్ణాహుతి నిర్వహిస్తారు. 14వ తేదీన మల్లన్న, భ్రమరాంబికలకు అశ్వవామనసేవ, రాత్రికి పుష్పఉత్సవం ఉంటుంది. అనంతరం శయనోత్సవ, ఏకాంత సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.