రేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్...
Revanth Reddy: రేవంత్ వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు.. వివరణ కోరనున్న అధిష్టానం...
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపిన అధ్యక్షుడు వ్యాఖ్యలు... ఆ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలే కాదు...సొంత పార్టీ నేతలు సైతం ఫైర్ అవుతున్నారా....? అధ్యక్షుడిపై ఆ వ్యాఖ్యల దెబ్బతో అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసే పనిలో ఉన్నారా...? ఆ వ్యాఖ్యలతో తెలంగాణ నేతలే కాదు అధిష్టానం దృష్టి సారించిందా ..? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఎం జరుగుతుంది ...?
తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు ఏ నేతలు ఎవరు ఏం మాట్లాడతారో తెలియక అధిష్టానం సతమతమయ్యేది. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం నేతలు చేసే విమర్శలకు అడ్డుకట్ట వేస్తూ ఆ నేతలను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసింది అధిష్టానం. దానిలో భాగమే రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన లో సొంత పార్టీ నేతలకు ముకుతాడు వేసేలా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల తరువాత మొన్నటి వరకు సైలెంట్ పాత్ర పోషించిన ఆ నేతలు రేవంత్ రెడ్డి రెడ్ల పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలంతా తీవ్ర అసహనంతో ఉన్నారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలోని నేతలంతా అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. దీనిపై స్పందించకపోతే తమకు నష్టం జరుగుతుందని ఆలోచనలో చాలామంది నేతలు ఉన్నారట.ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన రెడ్డి వెలమల వ్యాఖ్యలపై సైలెంట్ గా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఆ వర్గాల ప్రజలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ఇతర పార్టీల నేతలకంటే ముందే సొంత పార్టీ నేతలే మీడియా సమావేశాలతో పాటు బహిరంగ లేఖలను రాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో అధ్యక్షుడిపై ఫైర్ అయ్యారు.
తాజాగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ బహిరంగ లేఖ ను రిలీజ్ చేసి పార్టీ చరిత్ర గురించి ముందు తెలుసుకో అంటూ రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్ తో ఎస్సి ,ఎస్టీ, బిసి ,మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే ఇలాంటి సమయంలో అధ్యక్షుడు హోదాలో ఉన్న రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బిసి ఎస్సి, ఎస్టీ ఇతర మైనారిటీ వర్గాలు అన్ని కాంగ్రెస్ పార్టీయే దిక్కు అని భావిస్తున్న తరుణంలో అన్ని పార్టీలకు రెడ్లే నాయకత్వం వహిస్తే బాగుంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం అంటూ తన ఆగ్రహన్నీ వ్యక్తం చేశారు.
మీరు మాట్లాడిన భాష,యాస రాహుల్ , సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా ఉందన్నారు. పిసిసి అధ్యక్షుడుగా పర్సనల్,ప్రయివేటు, పబ్లిక్ ఏం ఉండదు మీరు ఏం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే భావిస్తారని ఆయన గుర్తు చేశారు.వెంటనే రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాలని అన్నారు.ఇప్పటికే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయగా తాజాగా మధుయాష్కీ తో పాటు మాజీ ఎంపీ విహెచ్ ఫిర్యాదు చేశారు.ఇలా పలువురు నేతలు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తుంది.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుండడంతో తెలంగాణ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తెలంగాణ పర్యటన లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు.బహిరంగంగా సొంత పార్టీ నేతలపై మాట్లాడవద్దని రాహుల్ వీడియోని ట్వీట్ ద్వారా జత చేశారు. మొన్నటి వరకు అధ్యక్షుడిపై ఫిర్యాదు చేసిన నేతలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తే తాజాగా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో అధిష్టానం తలపట్టుకుంటుంది.
రాహుల్ గాంధీ పర్యటన తరువాత అంతా ఒకే అనుకుంటే రేవంత్ రెడ్డి రెడ్డి, వెలమల గురించి చేసిన వ్యాఖ్యల దెబ్బతో అధిష్టానం ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో పడింది. అధ్యక్షుడే లైన్ దాటి ప్రవర్తిస్తే ఎలా అనే ఆలోచనలో అధిష్టానం ఉంది. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం వివరణ కోరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఠాగూర్ ట్వీట్ తో అయిన నేతలు సైలెంట్ అవుతారా లేదా ఎవరైనా మరోసారి రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తారో వేచి చూడాలి మరి.