ఊగరాబాద్ గా హుజూరాబాద్.. ప్రతి రోజు 9 లారీల్లో ఖాళీ మద్యం సీసాల తరలింపు

Huzurabad: ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ మద్యం ఏరులై పారుతుంది.

Update: 2021-10-25 11:46 GMT

Representational Image

Huzurabad: ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ మద్యం ఏరులై పారుతుంది. కానీ హుజూరాబాద్‌లో మాత్రం కాల్వలై పారుతుంది. ఇక్కడ మద్యం అమ్మకాల లెక్కలు కాదు ఖాళీ సీసాలను చూస్తేనే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. హుజూరాబాద్‌ నుంచి మద్యం బాటిళ్ల లోడు లారీలు వరుసపెట్టి కదులుతున్నాయి. ఖాళీ సీసాలతో గోదాములు నిండిపోతున్నాయి. ఇదంతా బై ఎలెక్షన్‌ పుణ్యమే అని చెప్పకతప్పదు. ఉప ఎన్నిక వేళ హుజూరాబాద్‌ ఊగరాబాద్‌గా మారిన వైనంపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

హుజూరాబాద్‌ మేడారం జాతరను తలపిస్తోంది. ఇక్కడి మద్యం అమ్మకాలు దసరా వేడుకలను మరిపిస్తున్నాయి. ఉపఎన్నిక సందర్భంగా హుజూరాబాద్‌లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఉదయమంతా ప్రచారాలతో బిజీగా ఉండే జనాలు. సాయంత్రం అవ్వగానే వైన్స్ షాపుల ముందు వాలిపోతున్నారు.

హుజూరాబాద్‌లో ఏ వైన్స్ షాపు చూసినా ఏ బార్‌ చూసినా కంటిన్యూగా కళకళలాడుతోంది. ఇక ఏ అడ్డాలో చూసినా ఏ చెట్టు కిందకు వెళ్లినా ఖాళీ సీసాలు కుప్పులు తెప్పలుగా కనిపిస్తున్నాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మూడు వారాల్లోనే 250 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. తాగి పడేసిన బాటిళ్లను తరలించడానికి రోజుకు 9 లారీలు కావాల్సివస్తుందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో రోజుకు ఓ లారీ సీసాలు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈసారి ఏకంగా రోజుకు 9 లారీలు మద్యం బాటిళ్లతో హుజూరాబాద్‌ దాటుతున్నాయి. దీంతో సీసాల వ్యాపారులు కూడా ఒక్కోసారి సరుకును తరలించలేక ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హుజూరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లంతకుంట, వీణవంక ఏరియాల్లో వందల కోట్లలో లిక్కర్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 29 మద్యంషాపులు ఉన్నాయి. హుజురాబాద్ పట్టణం, మండలంలో 9 వైన్స్ షాపులు ఉన్నాయి. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంటలో 15 షాపులు ఉన్నాయి. హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్న కమలాపూర్‌లో 5 దుఖనాలున్నాయి. ఇవి కాకుండా బెల్ట్‌షాపులకు లెక్కే లేదు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 29 మద్యం షాపుల్లో గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రూ.125కోట్ల మద్యం అమ్ముడుపోగా 2021లో రూ.170కోట్ల అమ్మకాలు జరిగాయి. కమలాపూర్ మండలంలో గతేడాది అక్టోబర్‌లో 4.72 కోట్ల వ్యాపారం జరిగితే ఈ ఏడాది అక్టోబర్‌లో మరో వారం మిగిలి ఉండగానే 3.67కోట్ల వ్యాపారం జరిగింది. ఇప్పటికే హుజురాబాద్‌లో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా మొత్తం 320 కోట్ల వ్యాపారం జరిగితే అందులో 55శాతం అమ్మకాలు హుజురాబాద్‌లోనే జరగడం గమనార్హం. మరోవైపు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా మద్యం నిల్వలు హుజూరాబాద్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. కానీ తాము బెల్ట్ షాపులను మూసేశామని అబ్కారీ శాఖ అధికారులు అంటున్నారు. మొత్తానికి ఉపఎన్నిక వేళ హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఊళ్లకు ఊళ్లు తాగి ఊగుతున్నాయి. మరీ ఎన్నికలు ముగిసేసరికి హుజూరాబాద్‌ నుంచి ఇంకెన్నీ లిక్కర్‌ సీసాల లారీలు కదులుతాయో చూడాలి.  

Tags:    

Similar News