రామప్పకు చుట్టుపక్కల పెరిగిన భూముల ధరలు.. భూముల కోసం ఎగబడుతున్న బడా కంపెనీలు
Ramappa Temple: రామప్ప ఆలయం చుట్టుపక్కల భూములపై బడా రియల్ కంపెనీలు కన్నేశాయి.
Ramappa Temple: రామప్ప ఆలయం చుట్టుపక్కల భూములపై బడా రియల్ కంపెనీలు కన్నేశాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తింపు వచ్చిన మర్నాటి నుంచే అక్కడ రియల్ వ్యాపారాలు మొదలయ్యాయి. ధర ఎంతైనా సరే చెల్లించి భూములను కొనేందుకు ముందుకు వస్తున్నాయి బడా కంపెనీలు. ఆలయ సమీపంలో ఎకరా భూమి ధర రూ.కోటి దాటేసింది. రామప్పలో రియల్ బూమ్‌పై స్పెషల్ స్టోరీ.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప టెంపుల్ జిల్లా కేంద్రానికి 13 కి.మీ. దూరంలో ఉంది. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రామప్ప ఆలయం 25 కి.మీ. దూరంలో ఉంది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రాగానే చుట్టుపక్కల 30 కి.మీ దూరం వరకు ఉన్న గ్రామాల్లో భూముల ధరలు పెరిగాయి. జంగాలపల్లి నుంచి గాంధీనగర్ దాకా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ల్యాండ్స్ ధరలు రిట్టింపు రేట్లు పలులకుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పటికే భూపాలపల్లి నుంచి గాంధీనగర్ వరకు ములుగు నుంచి జవహర్ నగర్ వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఇప్పుడు రామప్ప చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో రామప్ప చుట్టూ 10 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూముల ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఎకరానికి రూ.15 లక్షల నుంచి 20 లక్షల దాకా ఉన్న ధరలు ఇప్పుడు రూ.40 లక్షలకు పైగా పలుకుతున్నాయి. రోడ్లకు దగ్గర్లో ఉన్నభూముల రేట్లు కోటి రూపాయలు దాటేశాయి.
రామప్ప ఆలయం పక్కనే ఉన్న చెరువు కింద సుమారు 5,100 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మరో 5వేల ఎకరాల్లోని పంటలకు అనధికారికంగా నీరందిస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న పదికిపైగా గ్రామాలకు రామప్ప చెరువే జీవనాధారం. ఆ పల్లెల్లోని మరో వెయ్యి ఎకరాలకు రెండో పంటకు కూడా సాగునీరు అందుతోంది. 2019 వరకు ఇక్కడి వ్యవసాయ భూములకు పెద్దగా ధరలు ఉండేవి కావు. 2019లో ప్రపంచ వారసత్వ స్థలిగా రామప్పను యునెస్కో నామినేట్ చేయడంతో ఇక్కడ రియల్ బూమ్ మొదలైంది. వ్యాపారులతో పాటు పలువురు ఐఏఎస్‌లు, ఐసీఎస్‌లు కూడా బినామీ పేర్లతో ఇక్కడ భూములు కొన్నారు. దీంతో 2019కి ముందు ఎకరాకు గరిష్ఠంగా రూ.18 లక్షల దాకా పలికిన భూముల ధర..ఈ ఏడాది జూన్ నాటికి రూ.60 లక్షల వరకూ పెరిగింది. తాజాగా మండల కేంద్రమైన వెంకటాపూర్‌లో కూడా ఎకరాకు రూ.80 లక్షల వరకు భూముల ధర పెరిగింది. అయితే కొందరు రియల్టర్లు మాత్రం ఇక్కడి భూముల ధరలను భూతద్దంలో పెట్టి చూస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. చూసి పోయేవాళ్ళే గాని కొనేవాళ్ళు లేరంటున్నారు.
యాదాద్రి టెంపుల్‌ని అభివృద్ధి చేస్తుండటంతో గత మూడు, నాలుగేళ్లుగా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ కంపెనీలు యాదాద్రి చుట్టూ వెంచర్లు వేసి భూములను అమ్ముతున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ రామప్ప టెంపుల్ దగ్గర ఉన్న భూములపై దృష్టి పెట్టాయి. రాబోయే రోజుల్లో ఇక్కడి భూములకు ధరలు బాగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ఏజెంట్లను రంగంలోకి దింపాయి. ఎంత భూమి దొరికినా కొని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రయత్నిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అక్కడ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు బస చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఆలయం దగ్గర లేవు. దీంతో రామప్పకు దగ్గర్లో పెద్ద హోటళ్లు, షాపింగ్ మాల్స్ కట్టడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. గజానికి రూ.15 వేలకు పైగా చెల్లించి షాపు కట్టుకోవాలని భావిస్తున్నారు. కొందరైతే అడిగినంత ఇచ్చి ఇప్పటికే రోడ్డు వెంట ఉన్న భూముల్లో షాపుల ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకుంటున్నారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినప్పటి నుంచి రియల్టర్లకు కాల్స్ మొదలయ్యాయి. ములుగు, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో నివసించే వాళ్లకు భూములకు సంబంధించి తమ బంధు, మిత్రుల నుంచి ఫోన్ కాల్స్ పెరిగాయి. రామప్ప చుట్టుపక్కల గ్రామాల్లో వెహికల్స్ పెద్ద సంఖ్యలో చక్కర్లు కొడుతున్నాయి. పాలంపేట, పరిసర గ్రామాల్లో రియల్ వ్యాపారం జోరందుకోవడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిరక్షించుకునే పనిలో పడింది. పాలంపేట, వెంకటాపూర్, రామానుజపురం గ్రామాల్లో 30,161 ఎకరాల్లో అటవీ భూములు, 36,834 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వీటిల్లో ఇప్పటికే చాలా వరకు కబ్జాకు గురైంది. కొన్నిచోట్ల రైతులు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కార్యాలయాలను నిర్మించాలని యోచిస్తున్నారు. మొత్తానికి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుతో దాని పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భవిష్యత్తులో రామప్ప ప్రముఖ పర్యాటక కేంద్రం అయ్యే అవకాశం ఉండటంతో రియల్ వ్యాపారులు ఇక్కడ భూములు కొనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.