Telangana Politics: ఎల్‌.రమణ, పెద్దిరెడ్డిలపై గులాబీ స్ట్రాటజీ ఏంటి?

Telangana Politics: హుజురాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ తనదైన వ్యూహాలు అమలు చేస్తోంది.

Update: 2021-06-26 09:20 GMT

Telangana Politics: ఎల్‌.రమణ, పెద్దిరెడ్డిలపై గులాబీ స్ట్రాటజీ ఏంటి?

Telangana Politics: హుజురాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ తనదైన వ్యూహాలు అమలు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా రోజుకో రకమైన పావు కదుపుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు కీలక నేతలను కారెక్కించేందుకు గులాబీ అధిష్టానం సిద్దమైందట. అయితే, మాంచి ముహూర్తం కోసమే వెయిట్‌ చేస్తోందట. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను అటు బీజేపీ నేత హుజరాబాద్ టికెట్టు ఆశిస్తున్న నేత పెద్దరెడ్డిని ఇద్దరిని ఓకేసారి పార్టీలో చేర్చుకుంటే ఉపయోగం అనే ఆలోచననకు వచ్చినట్టు గలాబి వర్గాల్లో చర్చసాగుతోంది. దీంతో ఇరువురు నేతలు గులాబి తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమైన నేపద్యంలో అక్కడి రాజకీయాలు రంజుగా మారనున్నాయి.

హుజురాబాద్‌ ఉప ఎన్నికకు ఇంకా డేట్ ఫిక్స్‌ కాకపోయినా, రేపామాపా అన్నట్టుగా రాజకీయ పార్టీలు తొడగొడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అక్కడ మోహరించి, గ్రౌండ్‌లెవల్లో జనాకర్షణకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ మాత్రం, అంతుకమించి అన్నట్టుగా లెక్కలు సరి చేస్తోంది. ఇప్పటికే మండలాలు, గ్రామాలవారీగా భారీగా చేరికలను ప్రోత్సహిస్తోంది. పదునైన ఆయుధాలను కూడా తన అమ్ములపొదిలోకి తీసుకునేందుకు రకారకాల ఎత్తుగడలు వేస్తోంది.

ఎల్‌.రమణ. టీడీపీ తెలంగాణ తెలంగాణ అధ్యక్షుడు, మాజీ ఎంపీ. తెలంగాణలో తెలుగుదేశం అంతర్థానం అవుతున్న టైంలో, తన దారి తాను చూసుకోవాలని ఫిక్సయ్యారు. కొన్ని రోజుల కిందటే ఆయన కారెక్కడం ఖాయమన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇప్పటికిప్పుడు తనకు అలాంటి ఆలోచన లేదని, అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జగిత్యాలలో ప్రకటించారు. కారెక్కనని మాత్రం చెప్పలేదు. గులాబీ తీర్థంపుచ్చుకునేందుకు మాంచి టైం చూసుకుంటున్నారట రమణ.

ఎల్‌.రమణపై చాలా హోప్స్ పెట్టుకుంది టీఆర్ఎస్. ఎందుకంటే హుజురాబాద్‌లో సామాజిక సమీకరణలు పక్కాగా పట్టాలెక్కాలంటే, రమణ కారెక్కడం కీలకం. రమణ చేరిక ద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న పద్మశాలి ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చన్నది టీఆర్ఎస్‌ ఆలోచన. అటు రమణ సొంత నియోజకవర్గమైన జగిత్యాలలోనూ పార్టీకి మరింత బలం పెరుగుతుందని అంచనా వేస్తోంది. అందుకే ఎల్‌. రమణ చేరికపై స్వయంగా గులాబీ బాస్ దృష్టిపెట్టారట.

ఇక హుజురాబాద్‌లో మరో కీలక నేత ఇనుగాల పెద్దిరెడ్డి. ప్రస్తుతం బీజేపీలో వున్న టీడీపీ నేత. కమలాన్ని పక్కనపెట్టి, గులాబీ అందుకునేందుకు ఈ‍యన కూడా ముస్తాబవుతున్నారట. హుజురాబాద్ నియోజక వర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిథ్యం వహించిన పెద్దిరెడ్డి, చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన పెద్దిరెడ్డి, ఇటీవల రాజేందర్ చేరికతో అలకపాన్పు ఎక్కారు. ఇదే నియోజవర్గానికి చెందిన సీనియర్ అయిన తనను సంప్రదించకుండా, నిర్ణయం తీసుకున్నారని బాహాటంగానే విమర్శించిన పెద్దిరెడ్డి, ఇటీవల కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట. మరోవైపు పెద్దిరెడ్డి ఇప్పటికే గులాబీ బాసును కలిసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో పట్టు ఉన్న పెద్దిరెడ్డి సైతం, రమణ బాటలో పయనించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులంటున్నారు. ఈ నెలలోనే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చర్చసాగుతోంది. పెద్దిరెడ్డిని పార్టీలోకి తీసుకుని, హుజురాబాద్ గులాబీ టికెట్ ఇస్తారా లేక మరేదైనా పదవి కట్టబెడతారా అనేది సస్పెన్స్‌గా మారింది. చేరిక ఖాయమైతే ఎల్. రమణ, పెద్దిరెడ్డిలు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లేదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం వుంది.

తెలంగాణలో బీసీ నాయకునిగా ఎల్. రమణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిపైనా విజయం సాధించి, చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు. తెలుగుదేశం నుంచి చాలామంది నాయకులు బయటకు వెళ్లినా, రమణ మాత్రం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎల్. రమణ టీఆర్ఎస్‌లో చేరితే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బే. టీఆర్ఎస్‌కు మాంచి బూస్టింగ్. ముఖ్యంగా హుజురాబాద్‌ బైపోల్‌లో.

మరోవైపు కార్మిక నేతగా ఎదిగిన ఇనుగాల పెద్దిరెడ్డి, తెలుగుదేశం హయాంలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2003కు ముందు వరుసగా రెండు పర్యాయాలు హుజురాబాద్ నుంచి గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. ఈటెల బీజేపీలో చేరికతో పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. అక్కడి టెకెట్టు ఈటెలకు ఖరారు కావడంతో, ఆయన ప్రత్యామ్నాయ ఆలోచనలో పడ్డారట. టీటీడీ బోర్డు మెంబర్‌గా కూడా పని చేసిన పెద్దిరెడ్డి, మధ్యలో చంద్రబాబుతో విభేదించి దేవేందర్ గౌడ్ తో జతకట్టినా, ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. రాష్ట్ర విభజన తరువాత జాతీయ కమిటీలో చోటు కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఇటీవల హర్ట్‌ అయిన ఆయన, గులాబీ గూటికి రావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరితే హుజురాబాద్ నియోజకవర్గంలో కారు పార్టీ మరింత బలపడే అవకాశం ఉందనే అంచనాలో ఉన్నారు గులాబీ నేతలు.

మొత్తానికి ఎల్‌.రమణ, పెద్దిరెడ్డిలు కారెక్కడం ఖాయం. అయితే, దానికంటూ మాంచి ముహూర్తాన్ని ఫిక్సయ్యాలని ఆలోచిస్తోందట గులాబీ అధిష్టానం. ఇప్పుడిప్పుడే పార్టీలో చేర్చుకుంటే, బైపోల్ కంతా వేడి చల్లారుతుందని లెక్కలేస్తోందట. అదే షెడ్యూల్ వచ్చిన తర్వాత, లేదంటే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కారెక్కిస్తే, జోష్‌ వస్తుందని అనుకుంటున్నారట. అందుకే ఇప్పుడు కాకుండా, మరికొంత కాలం వెయిట్‌ చేసి, రెండు అస్త్రాలను సంధించాలని భావిస్తున్నారట గులాబీ బాస్. అదీ లెక్క.

Full View


Tags:    

Similar News