CM KCR: అందరి కోరిక మేరకు త్వరలో జాతీయ పార్టీ
*జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు మద్ధతిస్తాం కుమారస్వామి
CM KCR: జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా మంతనాలు చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమాస్వామి కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతిచ్చారు. ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయం వచ్చిందన్నారు కుమారస్వామి. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం ఉందన్నారు కుమారస్వామి.
గులాబీ బాస్ కేసీఆర్ ప్రత్యేక పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సందర్భంలో కుమారస్వామి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల విషయంలో తన ఆలోచనలు, తాను చేపట్టబోతున్న కార్యాచరణ గురించి కేసీఆర్ కుమారస్వామికి వివరించినట్లుగా తెలుస్తోంది. బీజేపీని గద్దె దింపాల్సిన అవసరం ఉందని.. ఎన్డీఏ, యూపీఏ తరహాలో మరో కూటమి అవసరమని కేసీఆర్ వివరిచాంచారని.. దానికి కుమారస్వామి అంగీకారం తెలిపారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు.. బీహార్, బెంగాల్, యూపీ, కర్ణాటకల్లో బీజేపీని అడ్డుకుంటే.. మోడీ ప్రధాని కావడం సాధ్యం కాదని వివరించినట్లుగా చెబుతున్నారు. దీనికి కుమారస్వామి అంగీకారం తెలిపినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందు నడుస్తూ, క్రియాశీలక భూమిక పోషించాలని, దానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలు, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొన్నదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని కుమారస్వామి అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ అవసరమున్నదన్న కుమారస్వామి త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ అజెండాపై ఇద్దరు నేతలు చర్చించామన్నారు.
ఇప్పటికే వివిధ రంగాల మేధావులతో చర్చించి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఏజెండా ఖరారు చేసామని, జాతీయ పార్టీ విధివిధానాలు రూపొందిస్తున్నాని కేసీఆర్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోందని కుమారస్వామికి కేసీఆర్ వివరించారు. మతోన్మాద బీజేపీ, మోడీ ప్రజావ్యతిరేక, నిరంకుశ వైఖరిపై పోరాడాలని జిల్లాల పర్యటనల్లో ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారని కేసీఆర్ అన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న కుమారస్వామి.. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని, ఆ పార్టీ నాయకత్వంపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న తరుణంలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రాంతీయ పార్టీల ఏకీకరణ ఏ మేరకు సాధ్యం అవుతుంది? జాతీయ పార్టీతో కేసీఆర్ సక్సెస్ అవుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై కీలక ప్రకటణ చేసే అవకాసం ఉందని అంటున్నారు గులాబి నేతలు.