Layout Regularisation Scheme : భూములు కొనుగోలు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అక్రమ లేఅవుట్లలో తెలియకుండానే ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి పోస్టర్‌ను, మీ సేవా సేవను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్కీమ్ గొప్ప వరమని ఆయన పేర్కొన్నారు.
పట్టణాలు, గ్రామాలలో లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించడానికి ఇదే మంచి అవకాశమని ఆయన అన్నారు. దీని ద్వారా యజమానులు స్వంత హక్కును పొందగలుగుతారు, అక్టోబర్ 15 లోపు రెగ్యులరైజేషన్ కోసం అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ప్రాథమిక సౌకర్యాలు, వాటితో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందుతాయని ఆయన తెలిపారు. అక్టోబర్ 15 లోపు దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు రెగ్యులరైజేషన్ ఫీజును 2021 జనవరి 31 లోపు చెల్లించవచ్చని తెలిపారు. ప్రభుత్వ భూముల్లోని ప్లాట్లు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మిగులు భూములు, ఎండోమెంట్స్ భూములు, సరస్సుల సమీపంలో ఉన్న భూములు, నీటి వనరులకు రెగ్యులరైజేషన్ పథకం వర్తించదని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, వాటర్ వర్క్స్ ఎండి ఎం. దానా కిషోర్ పాల్గొన్నారు.
LRS స్కీంలో రాష్ట్రంలో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గ్రామపంచాయతీల వరకు లేఅవుట్, అనుమతి వెంచర్ దారులు లక్షల మందికి ఊరట లభిస్తుంది. ఇందులో స్థలాల ఇందుకోసం అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఆగస్టు 26 వరకు కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును వేయి రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం లే అవుట్ అప్లికేషన్ ఫీజును పది వేలుగా ఖరారు చేసింది. 100 గజాలలోపు ప్లాటు కలిగి ఉన్న వాళ్లు రెగ్యులరైజేషన్ ఛార్జీల కింద గజానికి 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 100 నుంచి 300 గజాల వరకు 400 రూపాయలుగా రెగ్యులరైజేషన్ ఛార్జీలు ఖరారు చేశారు. 300 నుంచి 500 వరకు గజానికి 600 రూపాయలు రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మురికి వాడల్లోని పేదలకు చదరపు గజానికి ఫ్లాట్ ఏరియాకు భూవిలువతో సంబంధం లేకుండా చదరపు మీటరకు 5గా నిర్ణయించారు. దీంతో చాలా మంది పేదలకు ప్రభుత్వం మంచి చేసినట్టవుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఆదాయ వనరులతో పాటు అక్రమ వెంచర్లకు విముక్తి లభిస్తుంది. ఇటు లక్షల మంది పేద మధ్య తరగతి ప్రజలు అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి భారీ ఊరట వస్తుంది. దీంతో వచ్చే గ్రేటర్ హైదరాబాదాద్ ఎన్నికలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి రాజకీయంగా పెద్ద ఎత్తున లబ్ది కూడా చేకూరుతుంది.