Konda Surekha: కేటీఆర్ లీగల్ యాక్షన్.. దిగివచ్చిన కొండ

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపించారు. కొండా సురేఖ బుధవారం నాడు చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దురుద్దేశంతోనే ఆమె నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ తన లీగల్ నోటీసులో ఆరోపించారు.

Update: 2024-10-03 02:55 GMT

Konda Surekha: కేటీఆర్ లీగల్ యాక్షన్.. దిగివచ్చిన కొండ

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపించారు. కొండా సురేఖ బుధవారం నాడు చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దురుద్దేశంతోనే ఆమె నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ తన లీగల్ నోటీసులో ఆరోపించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం బుధవారం నాడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర స్థాయికి చేరుకుంది. అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయిన సురేఖ మీద బీఆర్ఎస్ వర్గాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఆ అభ్యంతరకర మీడియా పోస్టులపై బీఆర్ఎస్‌లో ఒక వర్గం క్షమాపణలు కోరింది. అందుకు, కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

బుధవారం నాడు మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వంటి పనులతో అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణల్లో భాగంగా ఆమె కొంత మంది సినీ నటుల పేర్లు కూడా ప్రస్తావించారు.

ఈ వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపాయి. సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున, సమంత, మరికొందరు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ‘మీ రాజకీయ ప్రయోజనాల కోసం సినీ ప్రముఖుల పేర్లు వాడుకోవద్దు’ అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.

సురేఖ చేసిన ‘హేయమైన వ్యాఖ్యలు’ వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉన్నాయని, ఆమె వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని, 24 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసు పంపించారు.


కొండా సురేఖకు లీగల్ నోటీసు ఇచ్చినట్లు చెబుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మూసీ నది మురికి అంతా వాళ్ళ నోట్లోనే, ఇంకా శుద్ధి ఎందుకు? లక్షన్నర కోట్ల ఖర్చెందుకు?’ అని కేటీఆర్ అన్నారు.




 

‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జుగుప్సాకరమైన, వికారమైన రాజకీయాలు చేస్తోంది. రాహుల్ గాంధీగారూ, మీ మంత్రిని, ముఖ్యమంత్రిని మానసిక నిపుణులు లేదా రిహాబిలిటేషన్ థెరపిస్టులకు చూపించండి’ అంటూ లీగల్ నోటీస్ కాపీని కేటీఆర్ పోస్ట్ చేశారు.

కాగా, కొండా సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మహిళల పట్ల ఒక నాయకుడికి ఉన్న చిన్నచూపును ప్రశ్నించడమే తన ఉద్దేశమని, ఎవరి మనోభావాలూ దెబ్బతీయడం కాదని అన్నారు. అందుకే, బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.


Tags:    

Similar News