కేసీఆర్ హయాంలో SGDP 14.5 లక్షల కోట్లకు పెరిగింది... రాష్ట్రం దివాలా తీసిందంటారా? కేటీఆర్
KTR speech in Telangana assembly sessions: బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు లేట్ అయ్యాయంటే... -కేటీఆర్ సమాధానం

బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు లేట్ అయ్యాయంటే... -కేటీఆర్ సమాధానం
KTR speech over Telangana SGDP and state per capita income: గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేకుండే అని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 2019 చివర్లో కరోనా వచ్చేంత వరకు జీతాలు సకాలంలోనే చెల్లించాం. కానీ కరోనా వచ్చిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. అలాంటి సమయంలో పేదలకు సంక్షేమం ఆపకుండా కొనసాగించడమే అప్పుడు తమ ప్రభుత్వం ముందున్న ధ్యేయంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు.
"ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల జీతాలు ఆగినా పర్వాలేదు కానీ రైతులకు రైతు బంధు ఆగొద్దని అనుకున్నాం. పేదలకు పెన్షన్స్ ఆగొద్దు... పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఆగొద్దని అనుకున్నాం. అందుకే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కొంత ఆలస్యం అయింది" అని కేటీఆర్ వివరణ ఇచ్చారు.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోందన్న కేటీఆర్
తాజా పరిస్థితిపై కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికీ రాష్ట్రంలో 8 నెలలుగా జీతాలు రాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారని ఆరోపించారు. మంత్రులు ఆ నిజాలు దాచిపెట్టి అబద్దాలు చెప్పడం సరికాదని అన్నారు. వాటికి సంబంధించిన పేపర్ కటింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయని కేటీఆర్ చెప్పారు.
గత పదేళ్లలో ఎస్జీడీపి ఎంత పెరిగిందంటే..
రాష్ట్రంలో మేం అధికారం చేపట్టినప్పుడు ఎస్జీడీపీ నాలుగన్నర లక్షల కోట్లు ఉంది. మేం అధికారంలోంచి దిగిపోయేటప్పుడు రూ. 14.5 లక్షల కోట్లకు పెరిగింది. ఇప్పుడు 16 లక్షల కోట్లుగా ఉంది. మరి గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆదాయం పెరిగిందా లేక తగ్గిందా అనేది ఆ లెక్కలే చెబుతున్నాయి కదా అని అన్నారు.
తలసరి ఆదాయం ఎక్కడి నుండి ఎక్కడికి పెరిగిందంటే..
ఆనాడు రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,12,162 గా ఉండేది. కానీ 2023-24 లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పేనాటికి తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,56,000 కు పెరిగి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరిందని కేటీఆర్ తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆదాయం ఈ స్థాయిలో పెరిగితే రాష్ట్రం దివాలా తీసిందని ఎలా అంటారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.