KTR: నీట్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్
KTR: విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదు
KTR: వైద్యవిద్య చదవాలన్న విద్యార్థుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని ఫైర్ అయ్యారు. ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.