హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరమంతా వరదలతో నిండిపోయింది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సహాయక చర్యలపై శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్‌లో డీఆర్ఎఫ్ వ్యవస్థ ఉందని చెప్పారు. నగరంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ రాత్రి 12 గంటల వరకు సమీక్షించినట్లు ఆయన తెలిపారు. నగరంలో వరదలు ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో సుమారుగా 40 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో సుమారు 80 వేల మందికి అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వరదల కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు సైతం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు.
పాత బస్తీలో అభ్యంతరకర భవనాల్లో ఉంటున్న వారికి కొంతమందికి నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. ప్రమాదకర ప్రదేశాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవనాలు ఖాళీ చేయని వారిని బలవంతంగానైనా చేయిస్తామన్నారు. అపార్ట్‌మెంట్‌లు, సెల్లార్ల వద్ద తగు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్‌లు, మేయర్, డిప్యూటీ మేయర్ జోన్ల పర్యవేక్షణలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం వరదలపై హైఅలెర్ట్‌గా ఉందన్నారు. హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ గేట్లను తెరిచామని తెలిపారు.
అనంతరం మంత్రి కేటీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మరో రెండు మూడు రోజుల పాటు వానలు తగ్గే సూచన లేదన్నారు. బాధితులందరికి వైద్య పరీక్షలు చేయించి, మందులు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో మరో రెండు రోజుల పాటు కూడా అక్కడే ఉండాలని ముంపు బాధితులకు కేటీఆర్ సూచించారు.