హైదరాబాద్ జలసౌధలో నీటి పంచాయితీ.. 8గంటల పాటు 16 అంశాలపై చర్చ..
KRMB Meeting: 66:34 నిష్పత్తిలో పంపిణీ ఆమోదయోగ్యం కాదు: తెలంగాణ
KRMB Meeting: ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఏళ్లు గడిచినా కొలిక్కిరావడం లేదు. జలవివాదాల పరిష్కారం కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్‌లో జలసౌధలో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ తన బాణీని స్పష్టంగా వినిపించింది. 66:34 నిష్పత్తిలో జలాల పంపిణీని గట్టిగా తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు సమానంగా నీటి వాటాలు ఇవ్వాలని తెలంగాణ పట్టుబట్టింది. కృష్ణా బేసిన్ లో నీటి వాటాలో మోసం చేశారని సమావేశంలో గట్టిగా వాదించారు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్.
66:34 నిష్పత్తిలో జలాల పంపిణీలో తాము భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేఆర్ఎంబీని కోరారు. 50 శాతం వాటా ఇవ్వకుంటే కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామని తెలిపారు. ఇదే విషయమై రజత్ కుమార్ ఇటీవల కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ కూడా రాశారు. ఆర్డీఎస్ మరమ్మతులకు సమైక్య రాష్ట్రంలో మంజూరైన పనులు జరగడం లేదని, మరమ్మతులు చేపట్టాలని బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది.
వరదనీరుపై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై భేటీలో చర్చించారు. తెలంగాణకు జలవిద్యుత్ ఉత్పత్తి చాలా అవసరం ఉందని సమావేశంలో తెలిపారు. శ్రీశైలంలో మిస్ మేనెజ్‌మెంట్ జరగలేదు, క్రైసిస్ మేనేజ్మెంట్ చేశామని చెప్పింది తెలంగాణ. ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడి శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ స్పష్టం చేసింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి విషయమై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
8గంటల పాటు జరిగిన సమావేశంలో ఏపీ అధికారులు వారి వాదనను గట్టిగా వినిపించారు. 66:34 నిష్పత్తిలో జలాలు ఇప్పటి వరకు పంపిణీ జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం 21-22 వాటర్ ఇయర్ లో శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలో క్రమశిక్షణ రహితంగా నీటిని వాడి విద్యుత్ ఉత్పత్తి చేశారని తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ అధికారులు బోర్డ్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తీరు కారణంగా శ్రీశైలం డ్యాంలో 5TMCల కంటే ఎక్కువ నీరు లేదన్నారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాం నిర్వహణకు 6 గురు సభ్యులతో కమిటీ వేశారు. కమిటీ 15 రోజుల్లో మొత్తం చర్చించి పవర్ జనరేషన్ పై ప్రోటోకాల్ ఫైనల్ చేసి బోర్డ్ అప్రోవ్ తీసుకోవాలన్నారు. అలాగే పులిచింతల గేటు ఎలా కొట్టుకుపోయిందో కమిటీ నివేదిక ఇవ్వాలని బోర్డ్ ని కోరింది ఆంధ్రప్రదేశ్. జలసౌధలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారి వాదనలను బోర్డ్ కి వినిపించాయి. నీటి కేటాయింపులతో పాటు విద్యుత్ ఉత్పత్తి పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మరోసారి కేఆర్‌ఎంబీ సమావేశం నిర్వహించారని బోర్డ్ భావిస్తుంది.