చెక్కుచెదరని రికార్డు.. 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూశారు.
Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూశారు. పల్స్ పడిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందారు. రేపు రోశయ్య పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించిన రోశయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజ్‌లో కామర్స్ పూర్తి చేశారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైయ్యారు రోశయ్య. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీఎంలందరి వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు రోశయ్య. 2009-10 బడ్జెట్‌తో కలిపి మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. దాంట్లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు ప్రవేశపెట్టగా.. ఒకసారి సీఎంగా ఆయన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ రికార్డును నెలకొల్పిన నేత కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఎవరూ లేరు. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందరు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతిచెందడంతో 2009 సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబర్ 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు. రోశయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు చెప్పారు.