kodangal attack: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

Patnam Narender Reddy: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) కి 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు.

Update: 2024-11-13 12:01 GMT

Patnam Narender Reddy

Patnam Narender Reddy: కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లగచర్లలో అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు. బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం లగచర్లలో దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ నుండి ఆయనను వికారాబాద్ కు తీసుకెళ్లారు. వికారాబాద్ నుంచి ఆయనను కొడంగల్ కోర్టుకు తీసుకెళ్లారు.అధికారులపై దాడి కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న బి. సురేశ్ తో పి.నరేందర్ రెడ్డి ఫోన్ సంభాషణ గురించి పోలీసులు విచారించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కొడంగల్ కోర్టులో హాజరుపర్చారు.నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారు.

అసలు ఏం జరిగింది?

దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు 1637 ఎకరాలు అవసరం. లగచర్లలో 637 ఎకరాలను 580 మంది రైతుల నుంచి సేకరించాలి. ఫార్మా క్లస్టర్ ఏర్పాటును ఇక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. నవంబర్ 11న దుద్యాల, లగచర్ల మధ్య ప్రజాభిప్రాయసేకరణ ఏర్పాటు చేశారు.

అయితే ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు ఎవరూ రాలేదు. లగచర్లకు కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులు వచ్చి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని బి.సురేష్ అనే వ్యక్తి కోరారు. లగచర్ల వెళ్లిన కలెక్టర్ సహా అధికారులపై రైతులు దాడికి దిగారు.అయితే ఇందుకు ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొంటున్న బి.సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు ఫోన్ లో మాట్లాడారని పోలీసులు గుర్తించారు. సురేష్ తమ పార్టీ కార్యకర్త అని అందుకే అతనితో ఫోన్ లో మాట్లాడినట్టుగా నరేందర్ రెడ్డి ప్రకటించారు.

నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ

నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. లగచర్లకు కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు గురువారం వెళ్లనున్నారు. 

Tags:    

Similar News