Kodandaram Comments on TRS Govt: దళితులపై దాడులు మానుకోవాలి: కోదండరాం
Kodandaram Comments on TRS Govt: దళితుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, దళితులపై దాడులు, భూమి లాక్కొవడం వంటి దుశ్చర్యలను మానుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు.
Kodandaram Comments on TRS Govt: దళితుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, దళితులపై దాడులు, భూమి లాక్కొవడం వంటి దుశ్చర్యలను మానుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నర్సింహులు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ నర్సింహులు మృతికి టీజేఎస్ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామన్నారు. దళితులకు ఇచ్చిన భూమిని ప్రభుత్వమే బెదిరించి తీసుకోవడం సమంజసం కాదని అన్నారు. కేసీఆర్ ఎన్నికల ముందు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హమీనిచ్చారు. కానీ ఆ హామీని నెరవేర్చకపోగా.. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను గుంజుకోవడం బాధాకరమన్నారు. భూమికి భూమి ఇయ్యమని బాధితులు చెప్పినా వినకుండా .. భూమిని లాక్కోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు కూడా పోలీసులు అడ్డుపడడం బాధకరమని అన్నారు. కేసీఆర్ తన ఆరేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని సరిగా నెరవేర్చలేదని అన్నారు. నర్సింహులు కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీళ్లను దొంగిలించుకుపోవడానికి ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని కోదండరాం విమర్శించారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.