Khairatabad: మరికాసేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం

Khairatabad: భారీగా పోలీసు బందోబస్తు

Update: 2022-09-09 03:44 GMT

Khairatabad: మరికాసేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం

Khairatabad: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి.

గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ మహాగణపతి బరువు రెట్టింపు అయ్యింది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60 నుంచి 70 టన్నులకు చేరింది. మహాగణపతిని సాగర తీరానికి ప్రత్యేక వాహనంపై తరలిస్తారు. ఈ వాహనం పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం... 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది.

ఇక ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు.

ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నంబర్‌–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం చేరుకోగానే వెల్డింగ్‌ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు తెలిపారు.

ఖైరతాబాద్‌ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్‌ థియేటర్‌ ముందు నుంచి రాజ్‌ దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్, ఎక్బాల్‌ మినార్‌ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నం– 4 వద్దకు చేరుకుంటుంది. 

Tags:    

Similar News