Group-2: గ్రూప్-2 అభ్యర్థులకు మరో కీలక అప్ డేట్.. ఈనెల 9 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Group-2: గ్రూప్ 2 అభ్యర్థులకు మరో కీలక అప్ డేట్ ను వెలువరించింది టీజీపీఎస్సీ. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు ఈనెల 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఉదయం, మధ్యాహ్నం మొత్తం రెండు సెషన్లలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం సెషన్ లో 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారని తెలిపింది. ఆ తర్వాత ఎంట్రీ ఉండదు. మధ్యాహ్నం సెషన్ కు 1.30 నుంచి 2.30గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇది రెండో గ్రూప్ 2 నోటిఫికేషన్. ఈ పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా..ఒక్కో పేపరుకు 150 మార్కులను కేటాయిస్తారు. ప్రతి పేపరులో మల్టిపుల్ ఛాయిస్ క్వచ్చన్స్ 150 చొప్పున ఉంటాయి. మొత్తం 600 ల మార్కులను పరిగణలోనికి తీసుకుంటారు. ఇందులో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులు గ్రూప్ 2 అధికారులుగా ఎంపిక చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకోనున్నారు.
కాగా గ్రూప్ 2 ఇప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొత్తం 783 పోస్టులతో 2022లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఈ ఉద్యోగ ప్రకటన వెలువడింది. అప్పట్లో దీనికి 5.51 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి షెడ్యూల్ ప్రకారం 2023 ఆగస్టు 29,30 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అప్పుడు గురుకుల టీచర్ ఉద్యోగాల పరీక్షలతో గ్రూప్ 2కు సరిగ్గా సిద్ధం కాలేదని అసంతృప్తితో ఉన్నారు. కొంత సమయం ఇవ్వాలని నిరుద్యోగులు కోరారు. దీంతో బీఆర్ఎస్ సర్కార్ వాయిదా వేసింది.