KCR with sarpanches: పదిరోజుల్లో రైతులందరికీ పాసుపుస్తకాలు..సీఎం కేసీఆర్‌

Update: 2020-07-25 04:22 GMT

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల సర్పంచులు వెంకట్‌రాంరెడ్డి, చంద్రశేఖర్‌లతో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచులు గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. వాటిని తక్షణమే పరిష్కరించి, పది రోజుల్లో రైతులందరికీ పట్టాదారు పుస్తకాలు అందజేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

సీఎం: హలో కొత్తపేట సర్పంచ్‌ వెంకట్రామిరెడ్డి, నేను సీఎంను మాట్లాడుతున్నా.

సర్పంచ్‌: సార్‌.. సార్‌ నమస్కారం.

సీఎం: మీ ఊరిలో భూ సమస్యలు పరిష్కరించడానికి అధికారులను పంపిస్తున్నాను.

సర్పంచ్‌: ఓకే సార్‌.. పంపించండి.

సీఎం: డీఏఓ శ్రావణ్‌కుమార్‌ వస్తున్నారు. దగ్గరుండి రైతులందరినీ జమ చేసి సమస్యను వివరించండి.

సర్పంచ్‌: ఓకే సార్‌.

సీఎం: భూ సమస్య పరిష్కారంతో రైతుబంధు చెక్కులు కూడా వస్తాయి.

సర్పంచ్‌: సార్‌ మీరు మా ఊరికి తప్పకుండా రావాలి

సీఎం: నేను శనివారం లేదా ఆదివారమైనా, సోమవారమైనా వస్తాను. శనివారం కలెక్టర్‌ను పంపిస్తాను అంటూ సీఎం కేసీఆర్‌ ఫోన్‌ పెట్టేశారు.

కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 600 మంది రైతులకు 524 ఎకరాల భూమి ఉన్నప్పటికీ, సీలింగ్‌ పట్టాగా రికార్డులలో నమోదైంది. దీంతో రిజిస్ట్రేషన్లు కాక, 60 ఏండ్లుగా ఈ రైతులెవరికీ ప్రభుత్వ పథకాలు వర్తించడంలేదు. రైతుబంధు, రైతుబీమా పథకాలు కూడా అందడం లేదని సర్పంచ్‌లు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. పలువురు నాయకుల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) శ్రావణ్‌కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం కొత్తపేటకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేయగానే గ్రామ సర్పంచ్‌ వెంకట్రామ్‌రెడ్డితో మాట్లాడించారు.

Tags:    

Similar News