కవితను కాపాడేందుకు కేసీఆర్ మొయినాబాద్ కేసును ప్రయోగించాలని భావించారు’ -ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ కన్ఫెషన్... ఆయన స్టేట్మెంట్‌లోని 10 ముఖ్యాంశాలివే...
మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల కేసును ఉపయోగించుకొని బీజేపీని రాజీకి ఒప్పించాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నించారని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు
మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల కేసును ఉపయోగించుకొని బీజేపీని రాజీకి ఒప్పించాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నించారని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. పోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం సెన్సేషన్‌గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కేసును ప్రయోగించి దిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన కూతురు కల్వకుంట్ల కవితను తప్పించాలని కేసీఆర్ భావించారని ఆయన తన కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని చేసిన ప్రయత్నం ఫెయిలైనట్టుగా రాధాకిషన్ రావు ఆ రిపోర్టులో తెలిపారు.దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. తన ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని ఆ రిపోర్టులో చెప్పారు. అయితే ఈ కేసు విషయమై తాను ఇంతకన్న ఎక్కువ సమాచారం ఇవ్వలేనని రాధాకిషన్ రావు ఆ స్టేట్ మెంట్ లో తెలిపారు.
బీఆర్ఎస్ , కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు, నేతలతో పాటు కొన్ని మీడియా సంస్థల యజమానుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టుగా రాధాకిషన్ రావు ఆ స్టేట్ మెంట్ లో తెలిపారు. అదే విధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకొని ప్రత్యర్ధులకు చేరే డబ్బును సీజ్ చేసిన విషయాలను కూడ పూసగుచ్చినట్టుగా వివరించారు.
ప్రత్యర్ధి పార్టీతో పాటు స్వంత పార్టీ నేతలపై కూడా కేసీఆర్ సూచన మేరకు ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా రాధాకిషన్ రావు తెలిపారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో రాధాకిషన్ రావును విచారించింది. ఈ విచారణ సందర్భంగా రాధాకిషన్ రావు చేసిన ప్రకటన కాపీ మీడియాకు లభించింది.
రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో 10 ముఖ్యాంశాలు
1. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ వసూళ్ల కేసులో పోలీసులు 2021 ఆగస్టులో అరెస్ట్ చేశారు. ఆయన కేసీఆర్ ను నిరంతరం విమర్శిస్తూ ఇరిటేట్ చేసేవారు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నవీన్ పై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారని రాధాకిషన్ రావు తెలిపారు.
2. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై 2022 డిసెంబర్ లో దాడి జరిగింది. సీఎం కేసీఆర్ సహా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే సమాచారంపై దాడి చేశారు. అయితే ఈ కేసు ఏమైందో తనకు తెలియదని రాధాకిషన్ రావు తెలిపారు. తమ పార్టీకి చెందిన నేతలు, మద్దతుదారుల సమాచారం తెలుసుకొనేందుకు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
3. ప్రతిమ గ్రూప్ నకు చెందిన బి. శ్రీనివాసరావు, యశోద ఆసుపత్రి యాజమాని బీఆర్ఎస్ కు అత్యంత సన్నిహితంగా మెలిగేవారని చెప్పారు. ఎన్నికల కోసం అడ్వాన్స్ గా నిధులను యశోద ఆసుపత్రి యాజమాన్యం సమకూర్చిందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజపుష్ప కన్ స్ట్రక్షన్స్ కంపెనీ కూడా బీఆర్ఎస్ కు నిధులను సమకూర్చిందని రాధాకిషన్ రావు తెలిపారు.
4. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందతో పొసగని కారణంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ ట్యాపింగ్ చేశారు. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నందున రాజయ్య ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్ లో తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో విబేధాల కారణంగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. తీగల కృష్ణారెడ్డి, ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
5. ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన అధినేతలు ఎన్ టీ వీ నరేంద్ర చౌదరి, ఏబీఎన్ రాధాకృష్ణ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టుగా రాధాకిషన్ రావు ఆ స్టేట్ మెంట్ లో తెలిపారు.
6. ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన విషయాన్ని రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు.అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, అచ్చంపేట ప్రస్తుత ఎమ్మెల్యే వంశీక్రిష్ణ, మానకొండూరు ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సిబ్బంది, ఈటల రాజేందర్, బండి సంజయ్, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తెలిపారు.
7. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అప్పట్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నిహితుల సమాచారం, ఫోన్లను ట్రాక్ చేయాలని సీఎం కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చినట్టు చెప్పారు. ప్రణీత్ రావు సహాయంతో వారిపై నిఘా ఏర్పాటు చేసినట్టుగా రాధాకిషన్ రావు వివరించారు.
8. ఈటల రాజేందర్ పీఏ జనార్దన్ నుండి రూ. 90 లక్షలను జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ వద్ద సీజ్ చేసిన విషయాన్ని రాధాకిషన్ రావు గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే, ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నిహితుల నుండి నగదు పంపిణీ విషయమై మానిటరింగ్ చేయాలని సీఎంఓ నుండి ఆదేశాలున్న విషయాన్ని రాధాకిషన్ రావు తెలిపారు.
9. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధికి నగదు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇంటలిజెన్స్ అధికారులను కోరినట్టుగా రాధాకిషన్ రావు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి మునుగోడు నియోజకవర్గానికి ప్రైవేట్ వాహనాల్లో డబ్బులు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా రాధాకిషన్ రావు తెలిపారు.
10. ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించినట్టుగా రాధాకిషన్ రావు తెలిపారు. ప్రత్యర్ధి పార్టీల నగదును సీజ్ చేయడంతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించిన నగదు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలనే ఆదేశాలు వచ్చాయని కూడా రాధాకిషన్ రావు తన ప్రకటనలో తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నగదు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసినట్లు వివరించారు.